ట్రంప్‌ దురాశ...అహంకారమే కొంపముంచిందా?

January 11, 2021
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై నేడు కాంగ్రెస్‌లో సెనేటర్లు అభిశంశన తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు.  వాషింగ్‌టన్‌లో క్యాపిటల్ హిల్ భవనంపై ట్రంప్‌ తన మద్దతుదారులను ఉసిగొల్పి కాంగ్రెస్‌ ఉభయసభల సభ్యులపై దాడులు చేయించేందుకు ప్రయత్నించినందుకు, జో బైడెన్‌ను అధ్యక్షుడిగా ఖరారు చేసే కీలకమైన కాంగ్రెస్‌ సమావేశానికి అంతరాయం కలిగించినందుకు అభిశంశన చేయనున్నారు. దీనిపై రేపటివరకు చర్చ జరిపి ఎల్లుండి ఓటింగ్ చేపడతారు. జో బైడెన్‌కు చెందిన డెమొక్రాట్ సెనేటర్లు ఎలాగూ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు. ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ సెనేటర్లలో కూడా సుమారు 150 మందివరకు ఆయనను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. 

ఈ నెల 20వ తేదీన జో బైడెన్‌ అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాధారణ పరిస్థితులలోనైతే అప్పటివరకూ డోనాల్డ్ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా కొనసాగవచ్చు. కానీ ఇప్పుడు అభిశంశన ఎదుర్కొబోతున్నందున ఆయన తొమ్మిది రోజుల ముందు అధ్యక్ష పదవికి రాజీనామా చేయవలసిరావచ్చు. అందుకే ట్రంప్‌ ‘తనను తాను క్షమించుకొనే అవకాశాల గురించి’ న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. అయితే తప్పు చేసినవారినే క్షమించడం జరుగుతుంది కనుక ఆవిధంగా చేస్తే ట్రంప్‌ తన తప్పును స్వయంగా దృవీకరించినట్లు అవుతుంది.  

అధికారంపై వ్యామోహం, దురాశ, అహంకారం, నోటి దురుసు, తెంపరితనం వంటి సకల అవలక్షణాలు ఉన్న డోనాల్డ్ ట్రంప్‌ ఇంతకాలం అమెరికా అధ్యక్షుడిగా ఉన్నందున ఆయనను ఎవరూ అడ్డుకోలేకపోయారు. కానీ ఇప్పుడు కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగినందున ట్రంప్‌ను కాంగ్రెస్‌ అభిశంశన చేసేందుకు సిద్దపడింది. ఈ చివరి 9 రోజులలో ఈ దుస్థితిని డోనాల్డ్ ట్రంప్‌ చేజేతులా కొనితెచ్చుకున్నారని చెప్పక తప్పదు. 

Related Post