ట్రంప్‌ తెంపరితనం...క్యాపిటల్ భవనంలో కాల్పులు

January 07, 2021
img

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హుందాగా తప్పుకోకుండా అధికారం నిలుపుకోవడం కోసం అడ్డుదారులు తొక్కుతూ అమెరికా పరువు తీస్తున్నారు. వాషింగ్‌టన్‌లో గల ‘క్యాపిటల్ హిల్’ భవనంలో నిన్న ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అధ్యక్షతన యూఎస్ కాంగ్రెస్‌ సమావేశం జరుగుతుండగా వందలాదిమంది ట్రంప్‌ మద్దతుదారులు మారణాయుధాలతో భవనంలో చొచ్చుకువెళ్ళి సమావేశాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా భద్రతాసిబ్బందికి, ట్రంప్‌ మద్దతుదారులకి మద్య జరిగిన ఎదురుకాల్పులలో ఒక మహిళ చనిపోయింది. 


అంతకు ముందు డోనాల్డ్ ట్రంప్‌ వాషింగ్‌టన్‌లో ఓ ర్యాలీలో పాల్గొని ‘మనం చివరి వరకు పోరాడుదాం...’అంటూ తన అనుచరులను రెచ్చగొట్టే విదంగా మాట్లాడారు. దాంతో వారు క్యాపిటల్ హిల్‌కు చేరుకొని జో బైడెన్‌ ఎన్నికను నిర్దారిస్తూ జరుగుతున్న సమావేశాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. 

ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు కానీ వారు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా భవనంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. పరిస్థితులు అదుపుతప్పే ప్రమాదం కనిపించడంతో ట్రంప్‌ స్వయంగా కేంద్ర బలగాలను అక్కడికి పంపించి ఆందోళనకారులను శాంతించవలసిందిగా ట్వీట్ చేశారు. 


వాషింగ్‌టన్‌ మేయర్ నగరంలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్‌ వ్యవహార శైలితో విసిగిపోయిన జో బైడెన్‌, ఈ ఘటనకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ట్రంప్‌ తన అనుచరులను శాంతింపజేయాలని సూచించారు. ట్రంప్‌ కారణంగా శాంతిభద్రతలకు భంగం కలిగే ప్రమాదం ఉన్నందున ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇంస్టాగ్రామ్ సంస్థలు ట్రంప్‌ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.  

జనవరి 20వ తేదీన జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కానీ ఏదోవిధంగా జో బైడెన్‌ను అడ్డుకొని తన అధికారాన్ని నిలుపుకోవాలని ట్రంప్‌ ఆరాటపడుతున్నారు. కానీ ఇటువంటి చర్యలతో ప్రజల దృష్టిలో, ప్రపంచదేశాల దృష్టిలో మరింత చులకన అవుతున్నానని గ్రహించడం లేదు. ట్రంప్‌ ఇలాగే వ్యవహరిస్తుంటే ఇంతవరకు ఆయనకు రక్షణగా నిలుస్తున్న భద్రతాసిబ్బంది చేతే ఆయనను మెడ పట్టుకొని బయటకు పంపించినా ఆశ్చర్యం లేదు.

Related Post