ట్రంప్‌ నిర్ణయాలు...జో బైడెన్‌కు తలనొప్పులు

January 06, 2021
img

జనవరి 20వ తేదీన జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంటే రెండు వారాలలో డోనాల్డ్ ట్రంప్‌ వైట్‌హౌస్‌ విడిచిపెట్టి వెళ్ళిపోవలసి ఉంటుందన్న మాట. కనుక ముందే ఊహించినట్లుగా జో బైడెన్‌ ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టించేందుకు ట్రంప్‌ సంచలన నిర్ణయాలు తీసుకొంటున్నారు. చైనాకు చెందిన 8 మొబైల్ యాప్‌లపై నిషేధం విదిస్తూ ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. వాటిలో అమెరికాలో చాలా విరివిగావాడే ఆలీపే, క్యూక్యూ వ్యాలెట్, క్యామ్ స్కానర్, షేర్ ఇట్, విమేట్, డబ్ల్యూపీఎస్ ఆఫీస్, టెంసెంట్ క్యూక్యూ, వియ్ ఛత్తీస్‌ఘడ్‌లో పే మొబైల్ యాప్‌లున్నాయి. 

వాటి ద్వారా అమెరికన్ల వ్యక్తిగత సమాచారంతో పాటు దేశభద్రతకు సంబందించిన సమాచారం కూడా చైనా ప్రభుత్వానికి చేరుతుందనే కారణంతో వాటిపై నిషేదం విధిస్తున్నట్లు ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో పేర్కొన్నారు. అయితే ట్రంప్‌ వైట్‌హౌస్‌ నుంచి వెళ్ళిపోయిన తరువాత 45 రోజులలోగా ఈ నిషేధం అమలులోకి వస్తుంది కనుక అప్పటికి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోయే జో బైడెన్‌కు చైనా నుంచి అభ్యంతరాలు, సవాళ్ళు ఎదుర్కోవలసి రావచ్చు. మిగిలిన ఈ రెండు వారాలలో ట్రంప్‌ ఇంకా ఎన్ని సమస్యలు సృష్టిస్తారో...అని జో బైడెన్‌ వర్గం ఆందోళన చెందుతోంది. కానీ ట్రంప్‌ వైట్‌హౌస్‌లో నుంచి బయటకు వెళ్ళేవరకు ఆయనను భరించక తప్పదు...ఆయన నిర్ణయాలను అధికారులు అమలుచేయక తప్పదు.

Related Post