జకార్తాలో పాకిస్థాన్‌ ఎంబసీ భవనాన్నే అమ్మేశాడు

August 27, 2020
img

అవును...పాకిస్థాన్‌ ఎంబసీ భవనాన్నే అమ్మేశారు.. 18 ఏళ్ళ క్రితం! ఇండోనేషియా రాజధాని జకార్తాలో గల పాకిస్థాన్‌ ఎంబసీ భవనాన్ని ఆ దేశంలో పాకిస్థాన్‌ రాయబారిగా పనిచేసిన రిటైర్డ్ ఆర్మీ జనరల్ సయ్యద్ ముస్తాఫా అన్వర్ అమ్మేశాడు. అయితే ఆయన ఈ విషయం ముందుగా పాకిస్థాన్‌ విదేశాంగశాఖకు తెలియజేయడం విశేషం కాగా విదేశాంగశాఖ వద్దని వారిస్తున్నా ఎంబసీ భవనాన్ని కారు చవుకగా అమ్మేయడం ఇంకా విశేషం. అయితే ఇదంతా 2001-2002లో జరిగింది. అంటే 18 ఏళ్ళు గడిచాయన్న మాట! 

అప్పటి నుంచి ఈ ఘటనపై పాకిస్థాన్‌ అకౌంటబిలిటీ బ్యూరో (పీఏబీ)విచారణ జరుపుతూనే ఉండటంతో గత నెల పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు పీఏబీకి గట్టిగా చీవాట్లు పెట్టింది. దాంతో ఈ నెల 19న పీఏబీ ఈ కేసుపై విచారణ జరిపింది. అప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సయ్యద్ ముస్తాఫా అన్వర్ పాకిస్తాన్ ఎంబసీ భవనాన్ని కారుచవుకగా  అమ్మేయడం వలన పాకిస్థాన్‌కు సుమారు రూ.10 కోట్లు నష్టం వచ్చిందని విదేశాంగశాఖ పేర్కొన్నట్లు పాక్‌ పత్రికలలో వార్తలు వచ్చాయి.      

ఇంతవరకు పాకిస్థాన్‌ను పాలించిన దేశాధినేతలు, సైన్యాధ్యక్షులలో చాలామంది ఈవిధంగా విచ్చలవిడిగా అవినీతికి పాల్పడినవారే కనుక పాకిస్థాన్‌ ప్రజలకు ఇదేమీ పెద్ద విచిత్రంగా అనిపించకపోవచ్చు కానీ ప్రపంచదేశాల ప్రజలకు మాత్రం ఓ రాయబారి విదేశాలలోని ఎంబసీ భవనాన్ని అమ్మేసుకోవడం చాలా విడ్డూరంగానే కనిపిస్తుంది. ఇమ్రాన్ ఖాన్ పాక్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత దేశ ఆర్ధిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందంటూ తన అధికార కాన్వాయ్‌లో కొన్ని కార్లను అమ్మేశారు. ప్రధానమంత్రి స్వయంగా తన కాన్వాయ్‌లోని కార్లు అమ్ముకోగా తప్పుకానిది ఎంబసీ కార్యాలయాన్ని రాయబారి అమ్ముకొంటే తప్పేమిటీ? కాకపోతే కాస్త ముందూ వెనుకా అంతే కదా!

Related Post