దిగివచ్చిన ట్రంప్‌ సర్కార్

August 14, 2020
img

అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ, ఎల్-1 వీసాల జారీపై ఆంక్షలను సడలించింది. గతంలో పనిచేస్తున్న సంస్థలలోనే మళ్ళీ పనిచేసేందుకు వచ్చేవారికి హెచ్-1బీ వీసాలు జారీ చేయాలని నిర్ణయించింది. అలాగే వారి జీవితభాగస్వాములు, వారి పిల్లలు కూడా ఎల్-1 వీసాలతో అమెరికాకు తిరిగి రావచ్చునని తెలిపింది. ఈ రెండు రకాల వీసాల జారీపై ఆంక్షలను సవరిస్తున్నట్లు అమెరికా విదేశాంగశాఖ బుదవారం విడుదల చేసిన ట్రావెల్ అడ్వైజరీలో తెలియజేసింది. దీంతో అమెరికాలో పనిచేస్తున్న భారత్‌ టెక్కీలకు చాలా ఊరట లభించినట్లయింది. 

కరోనా కారణంగా అమెరికాలో లాక్‌డౌన్‌ విధించడంతో లక్షలాదిమంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. వారందరికీ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అమెరికా ప్రభుత్వం విదేశీ ఉద్యోగులను తగ్గించే ప్రయత్నంలో హెచ్-1బీ, ఎల్-1 వీసాల జారీపై ఆంక్షలు విధించింది. కానీ ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడం, కోర్టులలో కేసులు దాఖలవడంతో ప్రభుత్వం తన నిర్ణయాలపై పునరాలోచన చేసి ఆంక్షలను సడలించింది. ఈ వీసాల జారీపై ఆంక్షలు విధించడం ద్వారా అమెరికన్లకు ఉద్యోగాలు లభిస్తాయో లేదో తెలియదు కానీ దేశంలో స్థిరపడి ఓటు హక్కు కలిగిన   లక్షలాదిమంది ప్రవాస భారతీయులు, విదేశీయులు తనకు వ్యతిరేకంగా ఓట్లు వేసే ప్రమాదం ఉంటుందని డోనాల్డ్ ట్రంప్‌ గ్రహించినందునే ఆంక్షలు సడలించి ఉండవచ్చు.

Related Post