అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్ధిగా కమలా హారిస్ ఎంపిక

August 12, 2020
img

ఈ ఏడాది నవంబర్‌ 3న జరుగనున్న అధ్యక్ష ఎన్నికలలో ప్రతిపక్ష డెమొక్రాట్ పార్టీ తరపున జో బిడెన్‌  డోనాల్డ్ ట్రంప్‌తో పోటీ పడుతున్నారు. ఆయన ఉపాధ్యక్ష అభ్యర్ధిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ను ఎంపిక చేసుకొన్నారు. “మంచిపోరాటయోధురాలు, అత్యుత్తమ ప్రజాసేవకురాలైన కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఎంచుకొనే అవకాశం లభించడం చాలా గౌరవంగా భావిస్తున్నాను,” అని జో బిడెన్ ట్వీట్ చేశారు. దానికి కమలా హారిస్‌ బదులిస్తూ “అమెరికా ప్రజల కోసం చిరకాలంగా పోరాడుతున్న జో బిడెన్ యావత్ దేశ ప్రజలను ఒక్క తాటిపైకి తీసుకురాగలరు. ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం కలగడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఆయన దేశాధ్యక్షుడిగా అయ్యేందుకు నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను,” అని ట్వీట్ చేశారు. 

అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా కూడా ఆమె ఎంపికను హర్షిస్తూ, “సెనేటర్ కమలా హారిస్‌ గురించి నాకు చాలా కాలంగా తెలుసు. ఈ పదవికి ఆమె అన్ని విధాలా అర్హురాలు. ఆమె మన రాజ్యాంగాన్ని కాపాడేందుకు చాలా కృషి చేశారు. అలాగే నిసహాయ ప్రజల తరపున చాలా పోరాడారు. ఆమెను ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఎంపిక చేయడం మన దేశానికి చాలా మంచిరోజుగా భావిస్తున్నాను. కనుక ఈ పోరాటంలో అందరం కలిసి విజయం సాధిద్దాం,” అని ట్వీట్ చేశారు.

గమ్మతైన విషయం ఏమిటంటే, ఈసారి జరుగబోయే అధ్యక్ష ఎన్నికలలో మొదట ఆమె జో బైడెన్‌తోనే పోటీ పడ్డారు. ఆ సందర్భంగా ఆమె జో బైడెన్‌ విధానాలపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. గత ఏడాది జరిగిన డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్ధి  నామినేషన్ ప్రక్రియలో ఆమె మద్దతు కూడగట్టలేక పోటీ నుంచి తప్పుకోవడంతో జో బైడెన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన నేతృత్వంలోనే కమలా హారిస్‌ రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధులతో పోటీకి సిద్దపడటం విశేషం. 

కమలా హారిస్‌ తల్లి పేరు శ్యామలా గోపాలన్. తమిళనాడుకు చెందిన ఆమె 1960లో అమెరికా వెళ్ళి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో బ్రెస్ట్ క్యాన్సర్ విభాగంలో డాక్టరేట్ చేశారు. కమలా హారిస్‌ తండ్రి పేరు డొనాల్డ్ హారిస్. బ్రిటిష్ జమైకాకు చెందిన ఆయన 1961లో అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. వారిరువురు ప్రేమించి పెళ్ళి చేసుకొన్నారు. వారి కుమార్తె కమలా హారిస్. 

Related Post