పాకిస్థాన్‌ ఎయిర్‌ లైన్స్‌పై అమెరికా నిషేదం!

July 10, 2020
img

పాకిస్థాన్‌ ఇంటెర్నేషనల్ ఎయిర్‌ లైన్స్‌ (పీఐఏ)పై అమెరికా నిషేధం విధించింది. అయితే అందుకు కరోనాయో దౌత్యపరమైన సమస్యలో కారణం కాదు. ఆ సంస్థకు చెందిన పైలట్లలో చాలామంది నకిలీ పైలట్ డిగ్రీలతో పైలట్ ఉద్యోగాలు సంపాదించడమే! 

మే 22న కరాచీ విమానాశ్రయం సమీపంలో గల ఇళ్లపై పీఐఏకి చెందిన ఓ విమానం కూలిపోగా విమానంలో ఉన్న సిబ్బందితో సహా మొత్తం 97మంది మరణించారు. అప్పుడే ఈ నకిలీ పైలట్ డిగ్రీల విషయం మరోసారి బయటకు పొక్కింది. పాక్‌ పైలట్లలో ప్రతీ ముగ్గురిలో ఒకరు నకిలీ డిగ్రీతో పైలట్ ఉద్యోగాలు పొందారని పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ స్వయంగా పాక్‌ పార్లమెంటులో ప్రకటించడం ప్రకంపనలు సృష్టించింది. ఇదే కారణంతో యూరోపియన్ యూనియన్ ఇదివరకే పాకిస్థాన్‌ ఇంటెర్నేషనల్ ఎయిర్‌ లైన్స్‌పై ఆరు నెలలు నిషేధం విధించింది. తాజాగా అమెరికా కూడా నిషేదించింది. 

విమానం నడిపేందుకు ఎంతో కటినమైన శిక్షణ ఉంటుంది. పైగా అది సామాన్యులకు అందుబాటులో ఉండదు కూడా. కనుక పైలట్ కావాలని కలలుకనేవారు ఏదోవిధంగా శిక్షణపొంది నకిలీ డిగ్రీలతో పైలట్ ఉద్యోగాలు సంపాదించుకొంటున్నారని తేలింది. అటువంటి ఓ నకిలీ పైలట్ కారణంగానే కరాచీలో విమానం కూలిపోయినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. ప్రయాణికుల ప్రాణాలు, వారి భద్రతే తమ ముఖ్యమని కనుక పాకిస్థాన్‌ ఇంటెర్నేషనల్ ఎయిర్‌ లైన్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.

Related Post