ట్రంప్‌పై చైనా పరోక్షంగా విమర్శలు

April 29, 2020
img

ప్రపంచంలో అన్ని దేశాల కంటే అమెరికా ఒక్కటే కరోనా మహమ్మారికి భారీ మూల్యం చెల్లిస్తోంది. అమెరికాలో కరోనా వైరస్‌ ప్రవేశించినప్పటి నుంచి నేటి వరకు 10, 34,588 మంది కరోనా సోకింది. వారిలో కేవలం 1,18,103 మంది మాత్రమే కోలుకోగా 58,955 మంది కరోనాతో మృతి చెందారు. మిగిలిన 8,57, 530 మంది నేటికీ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇవి సరిపోనట్లు ప్రతీరోజు వేలకేసులు కొత్తగా నమోదు అవుతున్నాయి... వందలమంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. కరోనాకు భయపడి లాక్‌డౌన్‌ చేసుకోవడంతో ఎంతో బలమైనదిగా చెప్పుకోబడే అమెరికా ఆర్ధికవ్యవస్థ కూడా క్రమంగా బలహీనపడుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా లక్షలమంది అమెరికన్లు నిరుద్యోగులుగా మారారు. అమెరికాకు తిరుగేలేదనుకొంటున్న సమయంలో ఇటువంటి దుస్థితులు కల్పించినందుకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ చైనాపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే చైనాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఆయన, ఇటీవల చైనా నుంచి నష్టపరిహారం వసూలు చేస్తామని హెచ్చరించారు. సకాలంలో కరోనా గురించి ప్రపంచదేశాలను హెచ్చరించకుండా ఇంత నష్టం కలిగించినందుకు చైనా బాధ్యతవహించాలని అన్నారు.  

ట్రంప్‌ హెచ్చరికలపై చైనా కూడా ఘాటుగా స్పందించింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ బీజింగులో మీడియాతో మాట్లాడుతూ, “అమెరికా నాయకులు ఏమాత్రం మొహమాటపడకుండా అబద్దాలాడుతున్నారు. వాటినే నిజమని ప్రచారం చేస్తున్నారు.  వారికి ఒకటే లక్ష్యం. ఈవిధంగా మమ్మల్ని నిందిస్తూ అమెరికా ప్రజల దృష్టిని మాపైకి మళ్లించి కరోనాను నియంత్రించే బాధ్యత నుంచి తప్పించుకోవడం,” అని అన్నారు. 

Related Post