వీసా రాకపోతే ఇక ఇంటికే!

July 19, 2018
img

హెచ్-1బి వీసాల జారీపై అమెరికా ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 11 నుంచి సరికొత్త ఆంక్షలు అమలుచేయబోతోంది. ఇప్పటి వరకు ఆ వీసాలపై అమెరికా వచ్చి ఉద్యోగాలు చేస్తున్నవారు వాటి కాలపరిమితి ముగియగానే మళ్ళీ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకొని, యధాప్రకారం తమ ఉద్యోగాలలో కొనసాగేవారు. ఒక్కోసారి దానికి ఏడు నెలల సమయం పట్టేది. కానీ వీసా లేకపోయినా ఉద్యోగాలు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందీ ఉండేది కాదు.

కానీ ఇక నుంచి హెచ్-1బి వీసాలు మంజూరు అయితేనే అమెరికాలో ఉద్యోగం చేసుకోగలుగుతారు. ఏకారణంగానైనా వీసా దరఖాస్తు తిరస్కరించబడినట్లయితే తక్షణం అమెరికా విడిచిపెట్టి వెళ్లిపోవలసి ఉంటుంది. వీసా దరఖాస్తులో లోపాలు ఉన్నట్లయితే సంబంధిత అధికారులు ఇదివరకులాగ సదరు అభ్యర్ధులకు నోటీసులు పంపరు. ‘మీ దరఖాస్తు తిరస్కరించబడిందని’ కనుక తక్షణమే అమెరికా విడిచి వెళ్లిపోవాలని తెలియజేస్తారు.

ఒకవేళ తమ దరఖాస్తులో పేర్కొన్న వివరాలలో ఎటువంటి లోపాలు లేవని సదరు అభ్యర్ధులు భావిస్తే అప్పీలు చేసుకొని దానిపై తీర్పు వచ్చేవరకు అమెరికాలోనే ఉండవచ్చు కానీ అంతవరకు ఎటువంటి ఉద్యోగమూ చేయరాదు. కనుక హెచ్-1బి వీసా దరఖాస్తును నింపేటప్పుడు దానిలో సూచించినవిధంగా అన్నీ సక్రమంగా ఉన్నాయని అభ్యర్ధులే ఒకటికి పదిసార్లు దృవీకరించుకోవలసి ఉంటుంది. అప్పుడు కూడా విచారణాధికారి దానిలో లోపం ఉన్నట్లు భావిస్తే వీసా దరఖాస్తును తిరస్కరించవచ్చు.అంటే హెచ్-1బి వీసా రెన్యువల్ చేయించుకోవడం కూడా ఇకపై చాలా కష్టమని స్పష్టమవుతోంది.

ఒకవేళ వీసా దరఖాస్తు తిరస్కరించబడిన తరువాత కూడా అమెరికాలోనే ఉండేందుకు ప్రయత్నిస్తే అమెరికా చట్టాల ప్రకారం శిక్షార్హులు అవుతారు. ఆ తరువాత మళ్ళీ 10 ఏళ్ళు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధించబడుతుంది. ఈ కొత్త ఆంక్షలు సెప్టెంబర్ 11వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.

కనుక అమెరికాలో స్థిరపడినవారు, ఆ వీసాలపై ఉద్యోగులను నియమించుకొంటున్న వేలాది సంస్థలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఇక భారత్ నుంచి హెచ్-1 బి వీసాలపై అమెరికా వెళ్ళాలనుకొంటున్నవారు ఆ ఆలోచన విరమించుకొంటే మంచిదేమో!

Related Post