పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అరెస్ట్

July 14, 2018
img

‘ఇవి భారత్ లో మాత్రమే సాద్యం’ అని చెప్పుకోగల పెద్ద జాబితా ఉన్నట్లుగానే ‘ఇవి పాకిస్తాన్ లో మాత్రమే సాధ్యం’ అని చెప్పుకోదగ్గవీ చాలానే ఉన్నాయి. వాటిలో పాక్ ప్రధానులు, అధ్యక్షులు అవినీతికి పాల్పడి జైలుకు వెళ్ళడం లేదా విదేశాలకు పారిపోవడం కూడా ఒకటి. తాజాగా పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, అయన కుమార్తె మర్యంలను పాక్ పోలీసులు లాహోర్ లోని అల్లారఖా ఇక్బాల్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసి ఇద్దరినీ రావల్పిండిలో సెంట్రల్ జైలుకు తరలించారు. 

ఇటువంటి అవినీతి కేసులను విచారించే ది నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో వారిద్దరూ మూడు అవినీతికేసులలో దోషులని నిర్దారించి ఇద్దరికీ జైలుశిక్షలు, బారీగా జరిమానాలు విధించింది. ఆ శిక్షలు ఖరారు అయిన సమయానికి వారిరువురూ లండన్ లో ఉన్నారు కనుక వారు స్వదేశానికి తిరిగి రాకుండా తప్పించుకొని ఉండవచ్చు. కానీ ఈనెల 25వ తేదీన జరుగబోయే సార్వత్రిక ఎన్నికలలో వారి పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ పోటీ చేస్తోంది. కనుకనే వారిద్దరూ పాకిస్తాన్ తిరిగి వచ్చి ఉండవచ్చు. ఊహించినట్లుగానే వారు పాకిస్తాన్ లో అడుగుపెట్టగానే పోలీసులు అరెస్ట్ చేసి వారిద్దరినీ జైలుకు తరలించారు. అందుకు నిరసనగా పాకిస్తాన్ లో పలు ప్రాంతాలలో వారి పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలు తెలియజేస్తున్నారు. సానుభూతి ఓటుతో తమ పార్టీ గెలుస్తుందని తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే కేసులన్నీ మాఫీ చేయించుకోవచ్చునని నవాజ్ షరీఫ్ ఆశ పడుతున్నారేమో? 

Related Post