కిషన్ రెడ్డికి తెరాస సూటి ప్రశ్న

October 27, 2017


img

రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈరోజు శాసనసభలో రాష్ట్రంలో రైతుల సమస్యలను ఏకరువు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆయనకు తెరాస ఎమ్మెల్యే జీవన్ సమాధానమిస్తూ, “రాష్ట్రంలో రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్న మీరు, వీటి గురించి కేంద్రప్రభుత్వంతో గట్టిగా మాట్లాడి గిట్టుబాటు ధర ఎందుకు ఇప్పించలేదు? మా ప్రభుత్వం తెలంగాణాలో రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న మీరు మీ భాజపా పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వాలు రైతులకు ఎటువంటి సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నాయో కాస్త వివరించగలరా? మీ భాజపా ప్రభుత్వాల కంటే అన్ని విధాలుగా మా తెలంగాణా ప్రభుత్వమే రైతులను ఆదుకొంటోంది. రాష్ట్రంలో రైతుల పట్ల మీకు నిజంగా అంత సానుభూతి ఉన్నట్లయితే, డిల్లీ వెళ్లి కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించి వారికి గిట్టుబాటు ధరలు కల్పించండి. ఇక్కడ స్ట్రీట్ ఫైట్స్ చేయడం వలన లాభం లేదు  అందరూ కలిసి స్టేట్ కోసం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది,” అని అన్నారు. 

రాష్ట్రంలో ఎప్పటికైనా అధికారంలోకి రావాలని కలలుగంటున్న భాజపా, పార్టీని బలోపేతం చేసుకోలేకపోతున్నా కనీసం ప్రజల ఆదరణ పొందే పనులు చేయడంలో విఫలం అవుతోంది. రాష్ట్రంలో సాగునీరు, ప్రాజెక్టులు వ్యవసాయం, నదీజలాల పంపకాలు, హైకోర్టు విభజన, ఉద్యోగుల పంపకాలు వంటి అనేక అపరిష్కృత సమస్యలను తెరాస ఎంపిలు, మంత్రులే డిల్లీ చుట్టూ తిరిగి పరిష్కరించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప రాష్ట్ర భాజపా నేతలు చేసిందేమీ లేదు. తెరాస ఎమ్మెల్యే చెప్పినట్లు కనీసం రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించడం కోసం వారు చొరవ తీసుకోవడం లేదు. రాష్ట్రంలో భాజపా అధికారంలో లేకపోయినా కేంద్రంలో ఉంది కనుక రాష్ట్ర భాజపా నేతలు తెలంగాణా రాష్ట్రం కోసం నిధులు, పెండింగ్ ప్రాజెక్టులను సాధించుకొని వచ్చినా ప్రజలు వారిని ఆదరించి ఉండేవారు. కానీ వారు ఎంతసేపు మోడీ భజన లేకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలతోనే కాలక్షేపం చేసేస్తున్నారు. వారు రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయినా కనీసం తమ పార్టీని కాపాడుకోగలిగితే అదే పదివేలు.

 ఇది చదివారా? భరత్ అను నేను రిలీజ్ ఫిక్స్..!


Related Post