సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు...మరి మిగిలిన వారికో?

October 27, 2017


img

తెలంగాణ భవన్ లో గురువారం జరిగిన తెరాస శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో 99 శాతం సిటింగ్ ఎమ్మెల్యేలకే టికెట్స్ ఇస్తామని చెప్పారు. మరొక రెండు మూడు వారాల్లోనే రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల పెంపు గురించి ఖచ్చితమైన సమాచారం లభించబోతోందని కనుక మిగిలినవారు ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని చెప్పారు. పునర్వ్యస్థీకరణ ద్వారా మరో 34 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. కనుక పార్టీలో చేరిన కొత్తవారికి, మొదటి నుంచి తెరాసలో ఉన్నవారికీ అందరికీ టికెట్స్ లభిస్తాయని చెప్పారు. కాకపోతే కాస్త ముందూ వెనుకా అవుతాయి కనుక అందరూ కాస్త ఓపిక పట్టాలని చెప్పారు. 

వచ్చే ఎన్నికలలో సిటింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు కేటాయిస్తానని కేసీఆర్ ప్రకటించారు కనుక వారే అభ్యర్ధులని ఖరారు అయిపోయింది. కనుక ఎన్నికలకు మూడు నెలలు ముందుగా కొత్తగా ప్రకటించేది ఏమీ ఉండదని భావించవచ్చు. 

ఇక అసెంబ్లీ స్థానాల పెంపు గురించి కేసీఆర్ ఇదివరకు ఒకసారి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వచ్చిన తరువాత, మీడియాతో మాట్లాడుతూ ‘ఈ విషయంలో మోడీ నిరాసక్తత చూపారని, కనుక వచ్చే ఎన్నికలలోగా శాసనసభ సీట్లు పెరిగే అవకాశాలు కనబడటం లేదని’ చెప్పారు. సీట్లు పెరగకపోయినా తమకు ఎటువంటి ఇబ్బందీ ఉండబోదని స్పష్టం చేశారు. కానీ నిన్న సమావేశంలో సీట్లు పెరిగే అవకాశం ఉందన్నట్లు చెపుతున్నారు. 

సీట్ల పెంపు కోసం రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ, ఆ పనికి పూనుకొంటే చిరకాలంగా దాని కోసం డిమాండ్ చేస్తున్న మిగిలిన రాష్ట్రాలు కూడా సీట్ల పెంపు కోసం పట్టుబడతాయని కేంద్రం భయపడుతోంది. కనుక దానిని కదిపితే తేనె తుట్టెను కదిపినట్లేనని భయపడుతోంది. కనుక సీట్ల పెంపు అనుమానమే. 

అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే కేసీఆర్ భరోసా ఇవ్వడం చేతనే కాంగ్రెస్, తెదేపా, వైకాపాల ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తెరాసలో చేరారని వేరే చెప్పనవసరం లేదు. ఆ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు కూడా టికెట్స్ ఖాయమేనని కేసీఆర్ నిన్న తేల్చి చెప్పినట్లే భావించవచ్చు.    

కానీ తెరాసలో చేరిన ఎమ్మెల్యేలు కాని ఇతరపార్టీల నేతలు, ఎంతో కాలంగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నవారు కూడా వచ్చే ఎన్నికలలో తమకు తప్పకుండా టికెట్స్ వస్తాయని ఆశపడుతున్నారు. వారందరూ టికెట్స్ కోసం పార్టీపై తీవ్రంగా ఒత్తిడి తేవడం ఖాయం. అందుకే ఎవరూ తమ అనుచరులను వెంటేసుకొని టికెట్స్ కోసం తెలంగాణా భవన్ కు రావద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న హెచ్చరించారు. 

ఒకవేళ అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగకపోతే ఆశవాహుల నుంచి కేసీఆర్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవలసి ఉంటుంది కనుక అయన చాలా ముందుచూపుతో పార్టీ కార్యవర్గాలు ఏర్పాటు చేసి వాటిలో వీలైనంత ఎక్కువమందికి పదవులు కట్టబెట్టారు. పార్టీ పదవులలో ఉన్నకారణంగా వారు టికెట్స్ కోసం గట్టిగా అడగలేని పరిస్థితి కల్పించినట్లయింది. కానీ త్వరలో సీట్ల పెంపు వ్యవహారం కూడా తేలిపోతే అప్పుడు అసలు కధ మొదలవవచ్చు. పార్టీలో టికెట్స్ రానివారు మళ్ళీ ఇతర పార్టీలలోకి తిరుగు ప్రయాణం కట్టవచ్చు లేదా వచ్చే ఎన్నికలలో కూడా మళ్ళీ తెరాస విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి కనుక తెరాసని అంటిపెట్టుకొని ఉండటమే మంచిదని భావిస్తే, పార్టీ పదవులతో సర్దుకుపోవచ్చు.

ఇది చదివారా: అదిరింది మళ్లీ వాయిదా పడింది..!


Related Post