ఇటీవల డయల్ యువర్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణా సాంస్కృతిక శాఖకు డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణగారి ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో సంస్కృతీ సంప్రదాయాలు, సాహిత్యం, కళల పునరుజ్జీవనం కోసం ఆయన చేస్తున్న కృషి గురించి, తద్వారా సాంస్కృతిక, కళారంగాలలో కనిపిస్తున్న అనేక మార్పుల గురించి తెలుసుకొన్నాము. ఈసారి మన సాహిత్యం, సినిమాలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకొన్నాయో తెలుసుకొందాం.
మామిడి హరికృష్ణగారు తెలంగాణాకు సంబందించిన ప్రతీ అంశంపై లోతుగా అధ్యయనం చేసి ఇంతవరకు సుమారు 10,000 పైగా వ్యాసాలు వ్రాశారు. ఒకప్పుడు ఉగాదినాడు మాత్రమే మొక్కుబడిగా కవి సమ్మేళనం జరిగేది. కానీ ఈ మూడేళ్ళలో వివిధ సందర్భాలను పురస్కరించుకొని అనేకసార్లు కవి సమ్మేళనాలు నిర్వహించబడ్డాయి.
“దాశరధి అవార్డు, కాళోజీ అవార్డును ఏర్పాటు చేసి ప్రతీ ఏటా మన కవులు, మన రచయితలను గుర్తించి గౌరవించుకొంటున్నాము. కేవలం ప్రముఖ రచయితలు, కవులనే ప్రోత్సహించి చేతులు దులుపుకోకుండా, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామాన్న ఉన్న చిన్నాపెద్ద రచయితలు, కవులను కూడా ప్రోత్సహించడానికి తొలిపొద్దు (442 కవులు వ్రాసిన కవితల పుస్తకం) ప్రచురించాము. దానికి ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
అదే స్పూర్తితో మన రాష్ట్ర పుష్పం అయిన ‘తంగేడుపువ్వు’పై కవితలు వ్రాయవలసిందిగా ఆహ్వానిస్తే, రాష్ట్రంలో మారుమూల గ్రామాలలో ఉండే యువ కవులు, మహిళలు సుమారు 400 కు పైగా కవితలు వ్రాసి పంపారు. వాటిలో అద్భుతంగా ఉన్న166 కవితలను ఎంపికచేసి ‘తంగేడువనం’ పేరుతో ఒక పుస్తకం అచ్చు వేశాము. అదేదో మామూలు ప్రేమ కవితల పుస్తకం మాత్రం కాదు. మన జీవన విధానం, మన బాష, యాస, గోస, మన చిన్నచిన్న ఆనందాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఆశలు, కోర్కెలు, ఆశయాలు, మన సంస్కృతీ, మన ఆచార వ్యవహారాలు...ఇలాగ ఒకటేమిటి తెలంగాణా ప్రజల ఆలోచనలకు అవి అద్దం పట్టాయి.
ఆ తరువాత ఎవరి గ్రామం, పట్టణం గురించి వారు బాగా తెలుసుకొని, వాటి గొప్పదనం, ప్రత్యేకతలు, సమస్యల గురించి లోకానికి తెలియజేసేందుకు ‘మట్టిముద్ర’ పేరుతో మరో పుస్తకం ప్రచురించాము. దానికీ ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వచ్చింది. అ తరువాత హరితహారం పధకం ప్రాముఖ్యత తెలియజేసే 166 కవితలతో కూడిన ‘ఆకుపచ్చని పొద్దుపొడుపు’ అనే పుస్తకం ప్రచురించాము. ఇలాగ మన తెలంగాణా సంస్కృతీ సాంప్రదాయాలను వెలికి తీసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాము,” అన్నారు మామిడి హరికృష్ణ.
“తెలుగు సినిమాల గురించి మాట్లాడుతూ, “ఇంతవరకు తెలుగు సినిమాలలో తెలంగాణా బాష, యాస కామెడీకో లేక విలన్ల బాషగానో చూపించేవారు. తెలంగాణా బాషను, యాసను ప్రేమించే నావంటివారికి అది చాలా బాధ కలిగించే విషయమే. అందుకే సినీ పరిశ్రమలో తెలంగాణా నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, రచయితలు, టెక్నీషియన్స్ ను చాలా ప్రోత్సహిస్తున్నాము. తెలంగాణాకు సంబందించిన అంశాలతో సినిమాలు, టీవీ సీరియల్స్ తీసేవారిని ప్రోత్సహిస్తున్నాము. మేము చేస్తున్న ఈ కృషితో ఎప్పటికైనా మన సినిమాలను మనమే తీసుకొనే స్థాయికి ఎదగాలని నా ఆకాంక్ష. అందుకే నూతన దర్శకులను, ఔత్సాహిక సినీ రచయితలు, నిర్మాతలను ప్రోత్సహించి వారికి అవసరమైన శిక్షణ ఇస్తున్నాము. వారి కోసం తరచూ వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నాము.
ఇక మన యువ దర్శకులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో రవీంద్రభారతిలో ప్రతీ శనివారం ‘సినీవారం’ పేరుతో వారు తీసిన షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శిస్తున్నాము. వాటితో మంచి గుర్తింపు పొందినవాడే మన సంకల్ప రెడ్డి. ఆయన తీసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరూ చూశారు. ఇదివరకు ఆయన ఒక మంచి షార్ట్ ఫిలిం తీశారు. దానికి చాలా ప్రశంశలు వచ్చాయి కానీ ఆయనకు తగిన గుర్తింపు రాలేదు. అయనను అతికష్టం మీద నేను వెతికి పట్టుకొని ఈ ‘సినీవారం’ గురించి చెప్పి దానిలో పాల్గొనడానికి ఒప్పించాను. అనేకమంది యువ రచయితలు, దర్శకులు, నిర్మాతలతో సినిమాలపై జరుగుతున్న చర్చలలో ఆయన కూడా పాల్గొన్న తరువాత తన పంధా, తన లక్ష్యం రెండూ సరైనవేనని ఆవిధంగానే ముందుకు సాగాలని ఆయన నిర్ణయించుకొన్నారు. విజయం సాధించారు.
మేము జరుపుతున్న ఈ వర్క్ షాప్స్ ను, షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శనలను చూసి దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడో హార్వర్డ్ యూనివర్సిటీలో మాత్రమే కనిపిస్తాయి. కానీ హైదరాబాద్ తో సహా అన్ని జిల్లా కేంద్రాలలో కూడా వీటిని నిర్వహిస్తున్నామని తెలుసుకొని ఆయన చాలా ఆశ్చర్యపోయారు. ఆయన కూడా తీరిక ఉన్నప్పుడు వచ్చి వాటిలో హాజరవుతున్నారు.
ఈవిధంగా మన తెలంగాణాకు సంబంధించి దేనినీ వదలకుండా ప్రతీ అంశం కోసం మేము పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తున్నాము. మా ఈ కృషి ఫలిస్తున్న ఆనవాళ్ళు స్పష్టంగా కనబడుతున్నాయి. అదే మాకు చాలా సంతృప్తినిస్తుంది,” అని చెప్పారు మామిడి హరికృష్ణ.
తెలంగాణా కోసం ఇంతగా పరితపించే వ్యక్తులు ఇంకా చాలా మందే ఉన్నారు. అటువంటివారిని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి వారికి సరైన స్థానం, బాధ్యతలు అప్పగించి, ప్రభుత్వం తరపున పూర్తి సహాయసహకారాలు అందిస్తుండటంవలన తెర వెనుక ఈ మహాయజ్ఞం నిశబ్దంగా సాగిపోతోంది. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.
మైతెలంగాణా అక్టోబర్ 5 సంచికలో ప్రచురితమైన మామిడి హరికృష్ణగారి ఇంటర్వ్యూ మొదటి, రెండవ భాగాలు చదవాలనుకొంటే ఈ క్రింద ఇచ్చిన లింక్స్ పై ప్రెస్ చేయండి:
మొదటి భాగం: http://www.mytelangana.com/telugu/editorial/8962/mamidi-harikrishna-interview
మామిడి హరికృష్ణగారి పూర్తి సంభాషణ వినాలనుకొంటే ఈ క్రింది లింకులో వినవచ్చు.
మీరు కూడా ఈ చర్చల్లో పాల్గొనాలనుకుంటే, ఈ క్రింది whatsapp గ్రూప్ ఆహ్వానం క్లిక్ చేసి, గ్రూప్ లో జాయిన్ అవండి.
https://chat.whatsapp.com/GchpC6r5qyF1sZOKWVRMng
"డయల్ యువర్ విల్లేజ్" ఫేస్ బుక్ లింక్: https://www.facebook.com/groups/821757117915265/