కాంగ్రెస్ పార్టీ ఏకైక ఆశాకిరణం ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా కనిపిస్తోంది. ఆయన పార్టీ పగ్గాలు చేపట్టబోతే పార్టీలో సీనియర్ నేతలే అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు. అలాగని పగ్గాలు చేపట్టకపోతే పార్టీకి నాయకత్వ సమస్య ఉందని భాజపా, ఇతర పార్టీలు, మీడియా చెప్పుకొంటాయి. మరోపక్క పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యపరిస్థితి పార్టీని నడిపించేందుకు సహకరించడం లేదు. దేశంలో భాజపాకు ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఈ దుస్థితిని చూసి పార్టీలో నేతలే కాకుండా దాని మిత్రపక్షాలు కూడా ఆందోళన చెందుతున్నాయి.
ఈ పరిస్థితులలో రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడుగా, ప్రియంకా వాద్రాను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందని సోనియా గాంధీ ఇటీవల సీనియర్ నేతలను అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ వార్తలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది.
ఒకవేళ ఆవిధంగా చేసినట్లయితే రాహుల్ గాంధీ చేతకానివాడు కనుకనే ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగించారని కాంగ్రెస్ పార్టీ స్వయంగా దృవీకరించినట్లు అవుతుంది. కనుక ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించవలసి ఉంటుంది. కానీ ఆయన శల్యసారధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తన ఉనికిని కోల్పోయే ప్రమాదంలో ఉంది. ఈసారి 6 నెలల ముందుగా ఎన్నికలు వెళ్ళాలని మోడీ సర్కార్ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కనుక కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సమయం లేదు. వీలైనంత త్వరగా ఈ నాయకత్వ సమస్యను పరిష్కరించుకోవలసి ఉంటుంది. లేకుంటే రాహుల్ గాంధీ భవిష్యత్, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది.