దటీజ్ కేసీఆర్!

June 20, 2017


img

ఒకప్పుడు దేశ జనాభాను చూసి అందరూ భయపడేవారు. కానీ ఇప్పుడు అదే జనాభాను అతిపెద్ద మానవవనరులుగా అందరూ గుర్తించడం మొదలుపెట్టారు. ఈ విషయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎవరూ సాటి ఉండరని ఖచ్చితంగా చెప్పవచ్చు. సిద్ధిపేట జిల్లా, కొండపాక గ్రామంలో గొల్ల కురుములకు ఈరోజు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తరువాత చేసిన ప్రసంగంలో మానవ వనరుల గురించి కేసీఆర్ చెప్పిన విషయాలు విన్నట్లయితే ఆవిషయం అర్ధం అవుతుంది. 

“మానవ వనరులని ఇంగ్లీషులో హ్యూమన్ రిసౌర్సస్ అంటారని మనందరికీ తెలుసు. కనుక అదేదో విప్రో కంపెనీలోనో ఇన్ఫోసిస్ వంటి ఐటి కంపెనీలలోనే ఉంటుందని చాలా మంది అనుకొంటారు. కానీ మానవ వనరులు అన్ని చోట్ల ఉన్నాయి. ఉదాహరణకు మన పల్లెల్లో యాదవులు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, మత్స్యకారులు.. వీళ్ళందరూ మానవ వనరులే. వారికి మనం కొత్తగా శిక్షణ ఏమీ ఇవ్వనవసరం లేదు. వంశపారంపర్యంగా ఆ వృత్తులలో మెళకువలు నేర్చుకొని వారు ఆరితేరిపోయున్నారు. వారికి కావలసిందల్లా ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయసహకారాలు మాత్రమే. వాటినే మన ప్రభుత్వం అందిస్తోందిప్పుడు. 

ఈవిధంగా రకరకాల వృత్తులు, పనులలో మంచి అనుభవం ఉన్న లక్షల మంది మనవ వనరులు మనకు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ వారి శక్తియుక్తులను గత ప్రభుత్వాలు గుర్తించలేదు. వారికి ఎటువంటి సహాయపడలేదు. కానీ మేము దానిని సరిగ్గానే గుర్తించగలిగాము. కనుకనే కులవృత్తులు చేసుకొనేవారికి అవసరమైన సహాయసహకారాలు అందించి రాష్ట్రానికి దేశానికి సంపద సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాము. 

కులవృత్తులను, వ్యవసాయాన్ని బలోపేతం చేస్తే గ్రామీణ వ్యవస్థ బలపడుతుంది. గ్రామాలు బలంగా ఉంటే రాష్ట్రం బలంగా ఉంటుంది. మానవ వనరులు అంటే ఎంతసేపు ఐటి కంపెనీలలో ఉండేవారే అని అనుకోకుండా రాష్ట్రంలో ఉన్న ఈ రకరకాలైన వృత్తులలో అపార అనుభవం ఉన్న మీరందరూ కూడా మన రాష్ట్రానికి అతిపెద్ద, గొప్ప మానవవనరు అని నేను నమ్ముతున్నాను. మీ అందరినీ నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకొని తదనుగుణంగా ఇటువంటి పధకాలు రూపొందించుకొని అమలు చేస్తున్నాము. మనమందరం కలిసి బంగారి తెలంగాణా సృష్టించుకొందాము,” అని అన్నారు. 

ఈవిధంగా కళ్ళెదుట ఉన్న అపారమైన మానవ వనరులను సరిగ్గా గుర్తించడమే కాకుండా వారికి అవసరమైన సహాయసహకారాలు అందిస్తే తద్వారా వారితో బాటు రాష్ట్రం, దేశం కూడా బాగుపడుతుందని కేసీఆర్ గ్రహించారు.  సాధారణ గొర్రెల కాపరులు కూడా దేశానికి సంపద సృష్టించగలరని కేసీఆర్ గుర్తించి తదనుగుణంగా ఇటువంటి గొప్ప పధకాలు రూపొందించడం కూడా చాలా గొప్ప విషయమే. ఇది ఆయన దూరదృష్టికి అద్దం పడుతోంది. 


Related Post