రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు బ్రేకులు వేసింది. ఇటీవల జరిగిన వ్రాత పరీక్షలలో చాలా అక్రమాలు జరిగాయంటూ దాఖలైన ఒక పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ కోసం 3 వారాలపాటు ఎటువంటి ప్రక్రియ జరుపరాదంటూ ఈరోజు స్టే విదించింది. మూడు వారాలలోగా దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
గ్రూప్-2 1032 పోస్టుల భర్తీ కోసం టి.ఎస్.పి.ఎస్.సి. గత నవంబర్ లో పరీక్షలు నిర్వహించగా 5.65 లక్షల మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఇటీవల ప్రకటించిన వాటి ఫలితాలలో . సుమారు 3,000 మంది అభ్యర్ధులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఉద్యోగాల భర్తీలో తదుపరి ప్రక్రియలో భాగంగా వారికి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు టి.ఎస్.పి.ఎస్.సి. వారి సర్టిఫికెట్లు పరిశీలన ప్రక్రియ చేపట్టింది. కానీ వ్రాత పరీక్షలలో అక్రమాలు జరిగాయని పిటిషన్ దాఖలు అవడంతో హటాత్తుగా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు మరో మూడు వారాలు బ్రేకులు పడినట్లయింది. దీంతో పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్ధులు తీవ్ర నిరాశనిస్పృహలకు లోనవుతున్నారు.
కానీ ఈమద్య ఇటువంటి పిటిషన్లు వరుసగా దాఖలవుతుండటం గమనార్హం. సింగరేణి వారసత్వ ఉద్యోగాల భర్తీకి ప్రయత్నించినప్పుడు ఇలాగే పిటిషన్ దాఖలవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తరువాత కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు అలాగే జరిగింది. ఇప్పుడు గ్రూప్-2 విషయంలోనూ అలాగే జరిగింది.
మూడేళ్ళు అవుతున్నా ఇంకా లక్ష ఉద్యోగాల భర్తీ ఎందుకు చేయలేదంటూ ప్రతిపక్షాలు నిత్యం ప్రభుత్వాన్ని నిలదీస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయగానే ఈవిధంగా పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. ప్రభుత్వం ఏ నియామకాల ప్రక్రియ చేపట్టిన ఏదో ఒక అక్రమం జరిగిపోయిందనో లేదా ఏదో ఒక వర్గానికి అన్యాయం జరుగుతోందనో పిటిషన్లు వేస్తుండటం గమనిస్తే, ఇది తెరాస సర్కార్ ను రాజకీయంగా ఎదుర్కోలేక దానిని అప్రదిష్టపాలు చేసేందుకే తెర వెనుక ఏవో రాజకీయ శక్తులు ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నాయనే అనుమానం కలుగుతోంది.
ఒకవేళ ఇక ముందుకూడా ఇదేవిధంగా పిటిషన్లు పడుతుంటే, ఇక తెరాస సర్కార్ ఎన్నటికీ ఉద్యోగాల భర్తీ చేయలేదు. దాని వలన తెరాసకు ప్రజలలో వ్యతిరేకత ఏర్పడుతుంది. తెరాసకు రాజకీయంగా నష్టం కలిగితే ప్రతిపక్షాలలో బలంగా ఉన్న పార్టీకి లబ్ది కలుగుతుంది. ఈ పిటిషన్ల వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. కనుక తెరాస సర్కార్ ఈ పిటిషన్ల వ్యవహారాన్ని కాస్త లోతుగా అధ్యయనం చేస్తే మంచిదేమో?