కేశినేని సెల్ఫ్ గోల్ ?

June 12, 2017


img

సాధారణంగా అధికార పార్టీపై, దాని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిత్యం విమర్శలు, అవినీతి ఆరోపణలు చేస్తుంటాయి. కానీ ఏపిలో ప్రతిపక్షాలతో బాటు మిత్రపక్షాలు (భాజపా, జనసేన) కూడా ప్రభుత్వ అవినీతిని వేలెత్తి చూపిస్తుంటాయి. అదీ పెద్ద విశేషమేమీ కాదు కానీ తెదేపా మంత్రులు, ప్రజాప్రతినిధులే స్వయంగా తమ ప్రభుత్వఅవినీతి గురించి ప్రతిపక్షాలతో కలిసి వంతపాడటమే విచిత్రం. 

విశాఖ భూకుంభకోణం గురించి మంత్రి అయ్యన్న పాత్రుడు మీడియా సమక్షంలోనే మాట్లాడి, రెవెన్యూశాఖలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. ప్రజలు కష్టపడి సంపాదించుకొన్న డబ్బుతో కొనుకొన్న భూములను కొందరు రాజకీయ నేతలు అవినీతి అధికారుల సహకారంతో విచ్చలవిడిగా దోచుకొంటున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణంపై విశాఖలోనే బహిరంగ విచారణ జరిపిస్తానని రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రకటించారు. 

ఇక తాజాగా తెదేపా ఎంపి కేశినేని నాని ఏపి రవాణా శాఖలో అవినీతి తారాస్థాయికి చేరిందని, అరుణాచల్ ప్రదేశ్, పాండిచ్చేరిలో రిజిస్ట్రేషన్ అయిన బస్సులు రాష్ట్రంలో తిరుగుతున్నా చూడనట్లు కళ్ళు మూసుకొని నిద్ర నటిస్తున్నారని అన్నారు. తాను లేఖ వ్రాస్తే అరుణాచల్ ప్రదేశ్, కేంద్ర హోంశాఖ స్పందించాయి కానీ రాష్ట్ర రవాణాశాఖ అధికారులు మాత్రం స్పందించలేదని విమర్శించారు. వారి అవినీతి, నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి బారీగా గండి పడుతోందని విమర్శించారు. వారి తీరును సహించలేకనే తాను ట్రావెల్ బిజినెస్ నుంచి తప్పుకొన్నానని అన్నారు. 

ఇక కాంగ్రెస్, వైకాపాలు నిత్యం తెదేపా ప్రభుత్వ అవినీతి గురించి విమర్శలు గుప్పిస్తూనే ఉంటాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న ఏసీబి దాడులలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారుల వద్ద నుంచి కోట్లాది రూపాయల విలువగల నగదు, ఆభరణాలు, స్థిరాస్తులు బయటపడుతుండటం అధికార, ప్రతిపక్ష, మిత్రపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చుతున్నట్లుంది. 

అయితే తెదేపా ఎంపి తన వ్యాపార శత్రువు(?)ను దెబ్బ తీసే ప్రయత్నంలో చేస్తున్న ఇటువంటి ఆరోపణలు సెల్ఫ్ గోల్ చేసుకొంటున్నట్లున్నాయి. ఒకపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ప్రభుత్వం పూర్తి అవినీతిరహితంగా పనిచేస్తోందని సెల్ఫ్ సర్టిఫై చేసుకొంటుంటే, తెదేపా ఎంపిలు, మంత్రులే ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందని చెప్పుకొంటే అది సెల్ఫ్ గోల్ చేసుకోవడమే అవుతుంది. దాని వలన ప్రభుత్వం ఎలాగు అప్రదిష్ట పాలవుతుంది. అదే జరిగితే, తన ప్రభుత్వానికి నష్టం కలుగజేస్తున్న నాని వంటి వారిని చంద్రబాబు వదిలించుకోకుండా ఉంటారా? 


Related Post