అమెరికాలోని ఫిలడెల్ఫియాలో స్థిరపడిన తెలంగాణావాసులు ‘డయల్ యువర్ విలేజ్’ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ప్రముఖ తెలంగాణా కవి, రచయిత నందిని సిద్దారెడ్డితో మాట్లాడినప్పుడు, ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ, దానికి ఎదురవుతున్న అడ్డంకుల గురించి అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం చాలా ఆలోచింపజేస్తుంది.
“మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద తప్ప రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలలో ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణకు పెద్దగా అవరోధాలు ఎదురవలేదనే చెప్పాలి. మల్లన్న సాగర్ విషయంలో ప్రభుత్వం కొంచెం తొందరపాటుతో వ్యవహరించిందని నేను భావిస్తున్నాను. కారణాలు ఏవైతేనేమి, మొదటి నుంచి ఆ ప్రాంతం ప్రజలలో తెరాస పట్ల వ్యతిరేకత ఉంది. కనుక భూసేకరణ విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగు వేసి ఉంటే ఈ సమస్య ఎదురయ్యేది కాదు. కానీ అధికారులు, తెరాస నేతలు సున్నితమైన ఈ సమస్యను సరిగ్గా హ్యాండిల్ చేయకపోగా చాలా దూకుడుగా వ్యవహరించడం వలన స్థానికులలో ఇంకా వ్యతిరేకత పెరిగింది. దానిని ప్రతిపక్షాలు ఒక అవకాశంగా మలుచుకొని వారినందరినీ సంఘటిత పరిచి భూసేకరణకు వ్యతిరేకంగా వారి చేత ధర్నాలు చేయించి, కోర్టులో కేసులు వేసి మల్లన్న సాగర్ ప్రాజెక్టును వివాదాస్పదంగా మార్చేసి ప్రభుత్వానికి బ్రేకులు వేయగాలిగాయి. మంత్రులు, అధికారులు, నిర్వాసితుల మద్య ‘కమ్యూనికేషన్ గ్యాప్’ కూడా దీనికి మరొక కారణంగా కనబడుతోంది. కనుక మల్లన్న సాగర్ భూసేకరణను ఇతర ప్రాంతాలతో పోల్చి చూడలేము,” అని అన్నారు.
ప్రొఫెసర్ కోదండరామ్, కేసీఆర్ మద్య పెరిగిన దూరం గురించి అన్యాపదేశంగా మాట్లాడుతూ, “అటు ఆయన, ఇటు ఈయన ఇద్దరూ కూడా కొంచెం సంయమనం పాటించి ఉండి ఉంటే బాగుండేది. కానీ ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకోగానే వెంటనే ఆయన దానికి వ్యతిరేకంగా స్పందించడం, అది చూసి తెరాస నేతలు మళ్ళీ ఆయనకు ఘాటుగా బదులివ్వడం ఒక నిరంతర ప్రక్రియగా మారిపోయింది. ప్రజల చేత ఎన్నుకోబడిన తెరాస సర్కార్ తీరు తనకు నచ్చలేదు కనుక తక్షణమే అధికారంలో నుంచి తప్పుకోవాలన్నట్లు ఆయన (ప్రొఫెసర్ కోదండరామ్) భావించడం తప్పు. అదే విధంగా ఆయన తనను (కేసీఆర్) వ్యతిరేకిస్తున్నారు కనుక ఆయనను శత్రువుగా భావించడం కూడా తప్పే. ఇద్దరి వైఖరిలో మార్పు రావాలసిన అవసరం ఉంది,” అని సిద్దారెడ్డి అన్నారు.
ధర్నాచౌక్ తరలింపు గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ప్రజలకు, ప్రతిపక్షాలకు తమ సమస్యలను చెప్పుకోవడానికి, ప్రభుత్వానికి తమ నిరసనలు తెలియజేయడానికి వారికి ధర్నాలు, ఆందోళనలు చేసే హక్కు ఉంది. దానిని ఎవరూ కాదనలేరు. కనుక తెరాస సర్కార్ ఈ విషయంలో తొందరపడిందని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైనప్పుడు విద్యార్ధులు ఆయనకు నిరసనలు తెలుపాలనుకోవడం కంటే వారు అయనను కలిసి తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం ఇచ్చి ఉండి ఉంటే అది సానుకూల, సహృద్భావ వాతావరణం ఏర్పడేందుకు దోహదపడి ఉండేదని సిద్దారెడ్డి అభిప్రాయపడ్డారు.
గమనిక: సిద్దారెడ్డి గారి ఈ ఇంటర్వ్యూ ఆయన తెలంగాణా సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా నియమించబడక ముందు ఇచ్చినది. కనుక ఆ పదవి పొందిన కారణంగా ఆయన తెరాస సర్కార్ కు అనుకూలంగా మాట్లాడుతున్నట్లు భావించరాదు. ఒక రచయితగా ఆయన తెరాస సర్కార్ బలాబలాలు, లోటుపాట్లను విశ్లేషించి చూపారు అంతే!
రెడ్డిగారి ఇంటర్వ్యూ లింక్స్
http://www.mytelangana.com/telugu/editorial/6783/nandini-sidda-reddy-interview
http://www.mytelangana.com/telugu/editorial/6784/nandini-sidda-reddy-interview
http://www.mytelangana.com/telugu/editorial/6874/nandini-sidda-reddys-interview