నీటిపారుదలపై తెరాస సర్కార్ తీరు బాగానే ఉంది కానీ..

May 01, 2017


img

                                                        నందిని సిద్దారెడ్డి ఇంటర్వ్యూ: రెండవ భాగం

“తెలంగాణా ఏర్పాటుకు ‘నీళ్ళు, నిధులు, నియామకాలు” అనే 3 ప్రాధమిక అవసరాల కారణంగానే ఏర్పాటు చేసుకొన్నామని తెలంగాణా సిద్దాంతకర్త స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ చెప్పారు. మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తెరాస ఆదిశలోనే అడుగులు వేస్తోంది. కానీ కొంచెం మెల్లగా సాగుతున్నట్లు నేను అభిప్రాయపడుతున్నాను. ప్రజల ఆంకాంక్షలు చాలా ఎక్కువగా ఉండటం వలన వాటిని అందుకొనే ప్రయత్నంలో తెరాస సర్కార్ పై తీవ్ర ఒత్తిడికి గురవడం సహజమే. మొదటి ఏడాది అంత నీళ్ళ విషయంలో అధ్యయనం చేసి అవగాహన పెంచుకోనేందుకే సరిపోయింది. దానికి తోడూ పొరుగు రాష్ట్రంతో నీళ్ళ పేచీలు ఉండనే ఉన్నాయి. కనుక ప్రతీ అడుగు భారంగానే పడుతోంది. కానీ ముందుకే సాగుతోందని ఖచ్చితంగా చెప్పగలను.”

ఉదాహరణకి మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో అనేక చెరువులు పునరుద్దరించబడి మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకొన్నాయి. తద్వారా అనేక జిల్లాలలో చిరకాలంగా బీడుపడిన పొలాలు మళ్ళీ పంటలతో పచ్చగా కళకళలాడుతున్నాయి. మేము కొంతమంది స్వయంగా కొన్ని జిల్లాలలో పర్యటించి కళ్ళారా చూసి నిర్ధారించుకని చెపుతున్న మాట ఇది. మరికొన్ని జిల్లాలలో నా మిత్రుల ద్వారా కూడా ఇది నిజమని సమాచారం అందుతోంది. రాష్ట్రంలో ఉన్న నీటివనరులు, ఏవిధంగా ఉపయోగించుకొంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.. రైతుల అవసరాలు, భౌగోళిక పరిస్థితులు, వాటితో ముడిపడున్న సంక్లిష్ట సమస్యల గురించి  ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత అవగాహన రాష్ట్రంలో మరే ప్రతిపక్షనేతకు, నీటి నిపుణులకు కూడా లేదని నా అభిప్రాయం.

మహబూబ్ నగర్ లో గుడిపల్లి ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించడంతో ఆ పరిసర ప్రాంతాలలో ప్రజలు పండుగ జరుపుకొంటున్నట్లు నా మిత్రులద్వారా తెలిసింది. మేడిగడ్డ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో పట్టువిడుపులు ప్రదర్శించడం మరో చక్కటి ఉదాహరణ. ఖమ్మం ఖమ్మం జిల్లాలో సత్తుపల్లిలో ఎన్టీఆర్ కాలువని చూశాము. ఒకప్పుడు దానిలోకి వచ్చిన నీళ్ళు వచ్చినట్లే దిగువకు వెళ్ళిపోయేవి. కేసీఆర్ వచ్చిన తరువాత దాని పక్కన చిన్న కాలువ తవ్వించి నీళ్ళను మళ్ళించడంతో ఆ పరిసర ప్రాంతాలలో 40 చెరువులకు నీళ్ళు చేరుతున్నాయిప్పుడు. ఎప్పటి నుంచో ఉన్న కాలువకు చాలా చిన్న మార్పు చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు రాబట్టగలిగారు. ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అవి నీటిపారుదలపై కేసీఆర్ కున్న సమగ్ర అవగాహనకు అద్దంపడతాయి.

ఒక్క నీటి పారుదల విషయంలోనే కాదు..చాలా విషయాలపై ఆయనకు మంచి అవగాహన ఉంది. కనుక  అన్నీ స్వయంగా పర్యవేక్షించాలనుకోవడం వలన పనులలో వేగం మండగించినట్లు కనబడుతోంది. పరిపాలనా వికేంద్రీకరణ చేసినట్లయితే, ప్రజల ఆకాంక్షలకు, తన ఆశయాలకు అనుగుణంగా పనులు జరుగుతాయని నేను భావిస్తున్నాను,” అన్నారు నందిని సిద్దారెడ్డి గారు. 

మొదటి భాగం లింక్: http://www.mytelangana.com/telugu/editorial/6783/nandini-sidda-reddy-interview 


Related Post