నందిని సిద్దారెడ్డి ఇంటర్వ్యూ:

May 01, 2017


img

విదేశాలలో స్థిరపడిన ప్రవాస తెలంగాణావాసులు తమ రాష్ట్రం కోసం..ప్రజల కోసం ఏదో చేయాలని పరితపిస్తుంటారు. అమెరికాలో చిరకాలంగా స్థిరపడిన కొందరు తెలంగాణాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఉడతాభక్తిగా సహాయసహకారాలు అందిస్తున్నారు. ఈ ప్రయత్నాలలో భాగంగానే ఫిలడెల్ఫియా తెలంగాణా అసోసియేషన్ వారు వారంలో ఒకరోజు ‘డయల్ యువర్ విలేజ్” అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానిలో రాష్ట్రంలో వివిధ రంగాలలో కృషి చేస్తున్న ప్రముఖులతో మాట్లాడి రాష్ట్రంలో వాస్తవిక పరిస్థితులను, ప్రజల అవసరాలను అర్ధం చేసుకొని, తదనుగుణంగా తమ ప్రాధాన్యతలను, ప్రణాళికలను రూపొందించుకొంటుంటారు. ఈ వారం ‘డయల్ యువర్ విలేజ్” అనే కార్యక్రమంలో భాగంగా ప్రముఖ తెలంగాణా రచయిత, కవి, తెలంగాణావాది నందిని సిద్దారెడ్డిగారితో వారు మాట్లాడారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ఆయన తెలంగాణా ప్రస్తుత పరిస్థితుల గురించి చెప్పిన విషయాలు చాలా ఆలోచింపజేస్తాయి. పలు అంశాలపై చాలా లోతుగా సాగన ఆయన ఇంటర్వ్యూ వివరాలను మా పాఠకుల సౌలభ్యం కోసం మూడు భాగాలలో ఇస్తున్నాము. 

                                                                     తెలంగాణా సాధన:

                                                        నందిని సిద్దారెడ్డి ఇంటర్వ్యూ: మొదటి భాగం

“తెలంగాణాకు వివిధరంగాలలో దశాబ్దాలుగా జరిగిన అన్యాయంపై ప్రజలు, మేధావులు, ప్రవాస తెలంగాణావాసులు చాలా ఏళ్ళు లోతుగా చర్చించి తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితేనే ఈ సమస్యలన్నిటి నుంచి విముక్తి లభిస్తుందనే ఏకాభిప్రాయానికి వచ్చారు. తెలంగాణా రాష్ట్రం కోసం చిరకాలంగా ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ అవి అసంఘటితంగా సాగినందున లక్ష్యం సాధించలేకపోయాయి. రాష్ట్ర సాధన కోసం ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం అని గుర్తించిన తరువాతే తెరాస ఆవిర్భవించింది. అది రాష్ట్ర సాధన బాధ్యత స్వీకరించి పోరాటం మొదలుపెట్టింది. నిజానికి దాని ఆవిర్భావానికి 5 ఏళ్ళు ముందుగానే తెలంగాణా కోసం పోరాటాలు మొదలయ్యి నిరంతరంగా సాగాయి. వాటిని తెరాస కొనసాగించి అనుకొన్న లక్ష్యం సాదించింది. తెలంగాణాలో అన్ని పార్టీలు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, విదేశాలలో ఉన్న ప్రవాస తెలంగాణాప్రజలు అందరూ కలిసికట్టుగా పోరాడి తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకోగలిగాము. తెలంగాణా రాష్ట్ర సాధన ఎంత ముఖ్యమో దాని అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని అందరూ భావించారు. కనుక రాష్ట్రం కోసం పోరాడిన తెరాసకే ప్రజలు పట్టం కట్టారు. రాష్ట్ర సమస్యలు, అవసరాలు, అందుబాటులో ఉన్న వనరులు మొదలైన వాటిపై కేసీఆర్ కు మంచి అవగాహన ఉందని ప్రజలు భావించడం మరో కారణంగా చెప్పుకోవచ్చు.

రెండవ భాగం లింక్: http://www.mytelangana.com/telugu/editorial/6784/nandini-sidda-reddy-interview 


Related Post