అమెరికాలోని ఫిలడెల్ఫియా తెలంగాణా అసోసియేషన్ సభ్యులు ఇటీవల ‘డయల్ యువర్ విలేజ్’ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ రచయిత నందిని సిద్దారెడ్డితో మాట్లాడినప్పుడు, కాగ్, నీతి ఆయోగ్ నివేదికల పట్ల చాలా ఆందోళన వ్యక్తం చేశారు.
“వాస్తవ పరిస్థితుల గురించి మనకు అటువంటి సమాచారం అందినప్పుడు దానిపై ప్రభుత్వంలో ఎవరో ఒకరు స్పందించి ఉంటే బాగుండేది. ఆ సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం ఏమి చేస్తోందో సంబందిత మంత్రులు ప్రజలకు వివరించి ఉండి ఉంటే బాగుండేది. కానీ దురదృష్టవశాత్తు ప్రతీ చిన్న అంశంపై స్పందించే మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఇంత ముఖ్యమైన అంశాలపై స్పందించలేదు. ప్రభుత్వ తీరు ఈవిధంగా ఉంటే ఇక బంగారి తెలంగాణా ఏవిధంగా ఎప్పటికి సాధ్యం అవుతుంది?” అని అమెరికాలోని ప్రవాస తెలంగాణావాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, గ్రంధాలయాల ఏర్పాటుకి తాము సహాయసహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు.
సిద్దారెడ్డి వారికి సమాధానం చెపుతూ, “సాధారణంగా కొంచెం అటు ఇటుగా ఏ ప్రభుత్వాలకైనా ఇటువంటి నివేదికలు వస్తూనే ఉంటాయి. వాటిలో తమకు అనుకూలమైన వాటిని మాత్రమే ప్రభుత్వాలు స్వీకరించి, ఇబ్బందికరమైనవి విడిచిపెట్టేస్తాయి. తెలంగాణా ప్రభుత్వం కూడా దానికేమి అతీతం కాదు. అలాగని ఈ హెచ్చరికలను పూర్తిగా పెడచెవిన పెడుతుందని భావించడం కూడా తప్పే. గాడి తప్పిన విద్యావ్యవస్థను మెరుగుపరచడానికి అన్ని చర్యలు చేపడుతుందని నేను చెప్పగలను. లేకుంటే ఇటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పుకోవడం కష్టం అవుతుంది,” అని అన్నారు.
“ఇక బంగారి తెలంగాణా అనేది కేసీఆర్ కలలుకంటున్న తెలంగాణా గురించి సామాన్య ప్రజలకు అర్ధమయ్యేలా వివరించడానికి ఆయన ఎంచుకొన్న ఒక పదంగానే చూడాలి తప్ప అదేదో ఒక ఒక అద్భుతమైన ప్రపంచంగా చూడటం సరికాదు. గతంలో కూడా ‘మరో ప్రపంచం’, స్వర్ణ యుగం’ ‘రామరాజ్యం’ వంటి అనేక పదాలను విన్నాము. కానీ వాటిని ఎవరూ ఎప్పుడూ చూడనేలేదు. అవన్నీ కల్పిత ప్రపంచాలే.
బంగారి తెలంగాణా అనేది రాత్రికి రాత్రే వచ్చేసేది కాదని అందరూ గ్రహించాలి. దాని కోసం దశాబ్దాల తరబడి ప్రభుత్వాలు, ప్రజలు, వ్యవస్థలు క్రమశిక్షణతో, చాలా నిబద్దతతో పనిచేయవలసి ఉంటుంది. అయితే బంగారి తెలంగాణా అనే పదాన్ని కేసీఆర్ ప్రజలకు పరిచయం చేశారు కనుక, అయనే ఇప్పుడు రాష్ట్రాన్ని నడిపిస్తున్నందున ఆ దిశలోనే ఆయన ముందుకు సాగుతున్నారు. కానీ అందరికీ తెలిసిన అనేక అవరోధాలు, సమస్యలు, కారణాల చేత ఆశించినంత వేగంగా అడుగులు ముందుకు పడటం లేదు. తెలంగాణా ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రజలలో చాలా బారీ అంచనాలు ఉన్నందున, అవి ఈ మూడేళ్ళలో సాకారం కాకపోవడంతో వారు కొంత నిరాశ, అసంతృప్తి, అసహనానికి లోనవడం సహజమే.
ఈ మూడేళ్ళ కాలం చాలా ఎక్కువేనని చాలా మంది భావించవచ్చు. కానీ ఏడు దశాబ్దాల పోరాటాలతో పోలిస్తే మూడేళ్ళు చాలా తక్కువేనని అర్ధం అవుతుంది. కనుక ప్రభుత్వాన్ని గుడ్డిగా వ్యతిరేకించే బదులు అది చేస్తున్న పనులలో నిబద్దత ఉందా లేదా అని నిశితంగా పరిశీలించడం మంచిది. ప్రభుత్వాన్ని నెగటివ్ కోణంలో నుంచి చూసే బదులు పాజిటివ్ కోణంలో నుంచి కూడా చూడగలిగితే దానికి రాష్ట్రాభివృద్ధి పట్ల నిబద్దత ఉందా లేదా ఉంటే ఏ మాత్రం ఉందని నిజాయితీగా అంచనా వేసుకోగలుగుతాము,” అని సిద్దారెడ్డి అన్నారు.
రెడ్డిగారి ఇంటర్వ్యూ లింక్స్
: http://www.mytelangana.com/telugu/editorial/6783/nandini-sidda-reddy-interview
http://www.mytelangana.com/telugu/editorial/6784/nandini-sidda-reddy-interview