అమృతధారలు-3

April 25, 2017


img

తెలంగాణాలో చాలా జిల్లాలలో సాగునీటి సౌకర్యం లేనందున బోరుబావుల ఆధారంగానే పంటలు సాగుచేస్తున్నారు. ఒకానొక సమయంలో రాష్ట్రంలో రైతులు ఒక చోట నీళ్ళు పడకపోతే మళ్ళీ మరొకచోట అక్కడా పడకపోతే ఇంకొక చోట బోరుబావులు తవ్వించి, చివరికి ఎక్కడా నీళ్ళు పడకపోతే వాటి కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకొనేవారు. నేటికీ కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉండటం చాలా కలచివేస్తోంది. వారు ఆత్మహత్యలు చేసుకోవడం, ఆ బోరు బావులలో అభంశుభం తెలియని పసిపిల్లలు పడి చనిపోవడం, ఆ కారణంగా వారి తల్లి తండ్రులకు తీరని శోకం వంటివన్నీ ఒక గొలుసుకట్టు పరిణామాలుగా నిరంతరంగా సాగిపోతున్నాయి. 

కర్నాటకలో జున్జార్ వార్డా అనే గ్రామంలో మొన్న ఒక ఆరేళ్ళ చిన్నారి బోరుబావిలో పడి ప్రాణాలు కోల్పోయింది. ఆమెను రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. మనసులను కలచివేసే ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణాలు..పరిష్కారాలను ఈ రంగంలో విశేష కృషి చేస్తున్న సుబాష్ చంద్ర రెడ్డి చెప్పారు.  

రైతులు బోర్లు తవ్వించిన తరువాత నీళ్ళు పడకపోతే పెట్టిన ఖర్చులో కనీసం ఒక రూ.20,000 అయినా రాబట్టుకొందామనే ఆశతో బోర్లలో వేసిన కేసింగ్ పైపులు తీసేస్తుంటారు. ఆ కారణంగా అక్కడ వదులుగా ఉన్న మట్టి కూలిపోయి బోరు బావి వ్యాసం ఇంకా పెద్దది అవుతుంది. ఒక్కోసారి అది 10-12 అంగుళాల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. కనుక వాటిలో చిన్నారులు పడిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. రైతులు కేసింగ్ పైపులు తీసుకోవడం తప్పు కాదు. కానీ వెంటనే ఆ బోరు బావులను తప్పనిసరిగా రాళ్ళు, మట్టితో పూడ్చిపెట్టాలి. లేదా కనీసం వాటిపై పెద్ద బండరాయి కానీ దాని చుట్టూ ముళ్ళ కంపలు కానీ వేసినట్లయితే ఇటువంటి ప్రమాదాలు నివారించవచ్చు. 

నీళ్ళు పడనప్పుడు రైతు, ఆ బోరు తవ్విన సంస్థ ఇద్దరూ నష్టపోతారు కనుక వారు తీవ్ర నిరాశతో నీళ్ళు పడని ఆ బోర్లను పట్టించుకోరు. కనుక ఒక గ్రామం బోరు తవ్వాలంటే ముందుగా స్థానిక పంచాయితీకి తెలియజేయడం, అలాగే బోర్లు తవ్వే సంస్థల ఎక్కడెక్కడ బోర్లు ఎంత లోతులో తవ్వాయో, నీళ్ళు పడ్డాయా లేదా పడకపోతే వాటికి క్యాపులు బిగించారా లేదా వంటి సమగ్ర సమాచారం స్థానిక పంచాయితీ, స్థానిక పోలీసులకు లేదా అధికారులకు ఇవ్వడం తప్పనిసరి చేస్తే ఈ సమస్యను అరికట్టవచ్చునని సుబాష్ చంద్ర రెడ్డి చెపుతున్నారు. 

ఇక బోరుబావులలో పడిపోయిన చిన్నారులను వీలైనంత త్వరగా సురక్షితంగా బయటకు తీసేందుకు చాలా ఏళ్ళ క్రితమే ఒక పరికరాన్ని తయారుచేశారు. కానీ దానిని ఎవరూ పట్టించుకోలేదు. అది పెద్ద ఖరీదైన పరికరం కాదు కానీ ప్రాణాలు కాపాడే చాలా గొప్ప పరికరం. కనుక రాష్ట్ర ప్రభుత్వం వాటిని కొనుగోలు చేసి ప్రతీ జిల్లా కేంద్రంలో వీలైతే మండల కేంద్రంలో అందుబాటులో ఉంచితే మంచిది. 


ఇది మానవ తప్పిదం కారణంగానే జరుగుతున్నప్పటికీ ఈ సమస్యను ప్రకృతి విపత్తుగా అందరూ భావించడం సరికాదని చెప్పారు. చివరిగా అయన ఒక్క విషయం చెప్పారు. మనం వర్షపునీటిని భూమిలోకి ఇంకించకుండా నీళ్ళు రావాలని కోరుకోవడం ఏవిధంగా ఉందంటే మనం బ్యాంకులో అసలు డబ్బు జమా చేయకుండా ఎటిఎంల నుంచి డబ్బు రావాలని ఆశించడమే అని అన్నారు. కనుక అసలు నీళ్ళు రావనుకొన్న బోర్లను కూడా శాస్వితంగా మూసి వేసే బదులు, ప్రమాదాలు జరుగకుండా తాత్కాలికంగా మూసివేసి, తనకు తెలియజేసినట్లయితే వాటిని వర్షపు నీటితో రీ-చార్జ్ చేసే అవకాశం ఉందో లేదో చూసి చెప్పగలనని అన్నారు. సాధారణంగా చాలా బోర్లు రీ-చార్జ్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. కనుక నీళ్ళు పడితే ఆ బోర్లు వేసిన రైతులకు కూడా వాటి వలన ప్రయోజనం కలుగుతుంది కనుక. ఆ బోర్లను తాత్కాలికంగా సీల్ చేసి ఆ విషయం తనకు తెలియజేసినట్లయితే వచ్చి పరిశీలించి తగిన సలహ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని సుబాష్ చంద్ర రెడ్డి చెపుతున్నారు. 

నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నవారు..ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకోవాలనుకొనేవారు.. సుబాష్ చంద్రరెడ్డి గారి సలహాలు, సేవలు పొందగోరేవారు.. సంప్రదించవలసిన ఈ మెయిల్ : saverainwater@gmail.com, ఫోన్: 9440055253

అమృతధారలు లింక్స్:

http://www.mytelangana.com/telugu/lifestyle/6678/subash-chandra-reddys-efforts-for-rain-water-conservation 


Related Post