ప్రధాని మోడీ నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో రెండు బాంబులు పేల్చారు. ఒకటి తమ తదుపరి లక్ష్యం తెలంగాణలో కూడా బిజేపి అధికారంలోకి రావడమే అని చెప్పారు. ఢిల్లీ, యూపీ, బిహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా ఒక్కో రాష్ట్రాన్ని బిజేపి కాషాయ జండాలు ఎగురవేస్తున్నప్పుడు వచ్చే ఎన్నికలలో తెలంగాణలో ఎగరేయకుండా ఉంటుందా? కనుక ప్రధాని మోడీ చెప్పిన ఈ మాట రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్న బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీలకు, అధికారం నిలుపుకోవాలని అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీకి బాంబులాంటి వార్తే!
ప్రధాని మోడీ దేశంలో బంగారం వ్యాపారులపై మరో బాంబు పేల్చారు. దేశ ప్రజలందరూ ఒక్క ఏడాది పాటు బంగారం కొనుగోలు పూర్తిగా మానేయాలని లేదా కనీసం బాగా తగ్గించుకోవాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. బంగారం కొనుగోలు తగ్గితే దిగుమతి తగ్గించుకోవచ్చని, అప్పుడు ఆ మేరకు భారీగా విదేశీ మారక ద్రవ్యం మిగులుతుందని ప్రధాని మోడీ చెప్పారు.
కానీ యావత్ ప్రపంచంలో భారతీయులకు బంగారం మీద ఉన్న మోజు అంతా ఇంతా కాదు. కనుకనే బంగారం ధర ఎంతగా పెరిగిపోతున్నా బంగారు ఆభరణాల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ కొత్త షాపులు వస్తూనే ఉన్నాయి.
కనుక ప్రధాని మోడీ కాదు కదా ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినా ప్రజలు బంగారం కొనడం మానుకోరు. కానీ ప్రధాని మోడీ విజ్ఞప్తిపై దేశ జనాభాలో ఒక్క శాతం ప్రజలు చెవికెక్కించుకున్నా బంగారం వ్యాపారం చేసేవారికి కష్టాలు, నష్టాలు మొదలవడం ఖాయం.