ప్రధాని మోడీ చెప్పేశారు.. మా తదుపరి లక్ష్యం తెలంగాణ!

May 10, 2026


img

ఈరోజు సాయంత్రం సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర బిజేపి అధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, పశ్చిమ బెంగాల్ ప్రజలు బిజేపి కావాలనుకున్నారు. అస్సాంలో వరుసగా మూడుసార్లు గెలిపించారు. పుదుచ్చేరిలో కూడా రెండో సారి బిజేపినే కావాలని ఎన్నుకున్నారు.

దేశంలో ప్రతీ రాష్ట్రంలో అభివృద్ధి కోసం బిజేపిని కోరుకుంటున్నారు. ఎన్నికలలో గెలుపోటములు సహజమే. కానీ పశ్చిమ బెంగాల్లో రాజకీయ పార్టీ ఓడిపోలేదు. అక్కడ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ బెంగాలీ ప్రజలను పీడిస్తున్న ఓ దుష్టరాజకీయ శక్తిని ప్రజలు ఓడించారు.

ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా బిజేపి రావాలని కోరుకొంటున్నారు. పార్టీ కార్యకర్తలలో పొంగి పొరలుతున్న ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఎన్నికలలో తెలంగాణలో కూడా బిజేపి అధికారంలోకి రావడం ఖాయమనిపిస్తోంది.

తెలంగాణలో కూడా బిజేపిని అధికారంలోకి తీసుకువస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడి అభివృద్ధి వేగవంతం అవుతుంది. కనుక నిస్సందేహంగా మా తదుపరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రమే,” అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. 

కనుక తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రావాలని, వస్తామని నమ్మకంగా ఉన్న కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు, వచ్చే ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అవుతానని చెప్తున్న టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అందరూ ప్రధాని మోడీ చెప్పిన ఈ మాటలను గంభీరంగా తీసుకొని తదనుగుణంగా ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుంది.


Related Post