టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత జాగృతి పరిస్థితి ఏమిటి? ఇకపై అది ఓ ఎన్‌జీవో సంస్థగా పనిచేస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జాగృతి ఎప్పటిలాగే తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, బతుకమ్మ తదితర పండుగల ప్రాధాన్యతని తెలియజేస్తూ పనిచేస్తుందని చెప్పారు.
టీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీగా ప్రజల కోసం వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందని చెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం జరగలేదని, అభివృద్ధి ఫలాలు పైనున్న వారికే దక్కాయి తప్ప బడుగు బలహీన వర్గాలు, నిరుపేద ప్రజలకు దక్కలేదన్నారు. కనుక గాంధీజీ చెప్పిన సర్వోదయ విధానం ప్రకారం రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమ న్యాయం చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు.
నాడు బీఆర్ఎస్‌కి అనుబంధంగా తెలంగాణ జాగృతి పని చేసేది. నేడు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పనిచేయబోతోంది. నాడు బీఆర్ఎస్‌తో కలిసి పని చేస్తున్నప్పుడు జాగృతి కార్యకలాపాలు చాలా జోరుగా సాగుతుంటే అందుకు సంతోషించి అభినందించాల్సిన కేసీఆర్ జాగృతి స్పీడ్ తగ్గించాలని హెచ్చరించారని ఇటీవల కల్వకుంట్ల కవిత చెప్పారు. కనుక ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా జాగృతి మళ్ళీ చురుకుగా పని చేస్తే కల్వకుంట్ల కవిత దానిని అనుమతిస్తారా లేక మెల్లగా అటకెక్కించేస్తారా? రాబోయే రోజుల్లో తెలుస్తుంది.