గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యం ప్రధాని మోడీపై కత్తులు దూసేవారు. ప్రధాని మోడీ హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా ఆయన పట్ల చాలా అవమానకరంగా వ్యవహరించేవారు. ఒకానొక సమయంలో ప్రధాని మోడీని గద్దె దించి, బిజేపిని, కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో విసిరేస్తానన్నారు కూడా.
నాడు ప్రధాని మోడీపై అంతగా నిప్పులు చెరిగిన కేసీఆర్ జగిత్యాల సభలో బిజేపిని, కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని పల్లెత్తు మాటనలేదు. ఆ ఊసే లేకుండా సిఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడంతో సరిపెట్టారు. కానీ ప్రసంగం చివర్లో ‘తెలంగాణ పునర్నిర్మాణానికి రాజకీయ శక్తుల పునరేకీకరణ’ అనే పదం మళ్ళీ వాడారు.
అది జీవన్ రెడ్డిలాంటి వారిని కలుపుకుపోవడమేనని కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు. కానీ బిజేపితో పొత్తులని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు.
కేసీఆర్ ప్రసంగంపై కాంగ్రెస్ నేతలు, మంత్రులు, కల్వకుంట్ల కవిత కూడా విమర్శలు గుప్పించారు. కానీ తెలంగాణ బిజేపి నేతలు మౌనంగా ఉండిపోయారు. రాబోయే రోజుల్లో బిజేపి-బీఆర్ఎస్‌ల మద్య పొత్తులు ఉంటాయనేనా? ఏమో?