జగిత్యాల సభలో కేసీఆర్ ప్రసంగంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య పెద్ద యుద్ధమే జరిగింది. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా తండ్రి ప్రసంగాన్ని, అహంభావాపు తీరు తప్పు పట్టారు. ఈ సభ జరుగుతున్న సమయంలో అత్యవసరంగా ఢిల్లీకి వెళ్ళిన హరీష్ రావు కూడా నేడు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం పెట్టి కేసీఆర్ ప్రసంగాన్ని గట్టిగా సమర్ధిస్తూ మాట్లాడారు.
కానీ ఈ సభ జరగడానికి ముఖ్య కారకుడైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఇంత వరకు ఒక్క ముక్క మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
కేటీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనని పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఆ తర్వాత ఆయన ఫామ్‌హౌసుకి వచ్చి కేసీఆర్‌ని కలవడం, అప్పుడే జగిత్యాలలో సభ పెట్టాలని నిర్ణయించడం జరిగింది. ఈ సభ ఏర్పాటుకి కూడా కేటీఆర్ చాలా శ్రమించారు. కానీ సభలో పాల్గొనలేదని సమాచారం. అందుకు వేరే కారణం ఏదో ఉండవచ్చు.
కానీ జగిత్యాల సభ.. దానిలో కేసీఆర్ ప్రసంగంపై కాంగ్రెస్ నేతలు, కల్వకుంట్ల కవిత దుమ్మెత్తిపోస్తున్నా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేటీఆర్ అలిగారా లేక వేరే వ్యాపకాలతో బిజీగా ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీయే చెప్పాలి.