కేసీఆర్‌ నోట మళ్ళీ రాజకీయ శక్తుల పునరేకీకరణ!

April 21, 2026


img

నిన్న జగిత్యాల సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీ తప్పకుండా గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తుందని నమ్మకంగా చెప్పారు. దానికి అయన రెండు కారణాలు చెప్పారు. సిఎం రేవంత్ రెడ్డి పాలన అధ్వానంగా సాగుతున్నందున ప్రజలు మళ్ళీ మార్పు కోరుకుంటున్నారనేది సాధారణ కారణం. 

“తెలంగాణ పునర్నిర్మాణానికి రాజకీయ శక్తుల పునరేకీకరణ,” అనే మాట కేసీఆర్‌ ప్రయోగించారు. ఇదే రెండవ కారణంగా కనిపిస్తోంది.   

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న తనని విడిపించుకోవడానికే బీఆర్ఎస్‌ పార్టీని బిజేపిలో విలీనం చేసేందుకు కేసీఆర్‌ సిద్దపడ్డారని, కానీ తానే వారించానని కల్వకుంట్ల కవిత స్వయంగా చెప్పిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. 

ఆ తర్వాత సీబీఐ, ఈడీలు ఆ కేసు అటకెక్కించేయడం, కాళేశ్వరం కేసుపై సీబీఐ విచారణ జరిపించాలనే తెలంగాణ ప్రభుత్వం వినతిని కేంద్రం పట్టించుకోకపోవడం, కేసీఆర్‌, హరీష్‌ రావు, కేటీఆర్‌లను అరెస్ట్ చేయకుండా కేంద్రం అడ్డుకుంటోందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు, ఇటీవల బిజేపి-బీఆర్ఎస్‌ పార్టీల పొత్తులంటూ వినిపిస్తున్న ఊహాగానాలు... అన్నిటినీ కలిపి చూస్తే కేసీఆర్‌ చెప్పిన ‘రాజకీయ శక్తుల పునరేకీకరణ’ ఇదే కావచ్చనిపిస్తుంది. 

రాజకీయాలలో శాశ్విత మిత్రులు, శాశ్విత శత్రువులు ఉండరు కనుక ‘తెలంగాణ కోసం’ బిజేపితో బీఆర్ఎస్‌ పార్టీ చేతులు కలుపుతుందని కేసీఆర్‌ నిన్న సూచనప్రాయంగా చెప్పినట్లనిపిస్తోంది. అవునో కాదో కాలమే చెప్తుంది.


Related Post