సోమవారం సాయంత్రం పోటాపోటీగా జరిగిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల బహిరంగ సభలలో సిఎం రేవంత్ రెడ్డి, మాజీ సిఎం కేసీఆర్ ఇద్దరూ కూడా వచ్చే ఎన్నికలలో మేమే గెలుస్తాం.. మేమే అధికారంలోకి వస్తామని గట్టిగా, పూర్తి నమ్మకంగా చెప్పుకున్నారు.
జగిత్యాల సభలో కేసీఆర్ మాట్లాడుతూ పదేళ్ళు మా ప్రభుత్వం కష్టపడి అన్ని రంగాలలో తెలంగాణని అభివృద్ధి చేసి ప్రజా రంజకమైన పాలన సాగిస్తే, రెండున్నరేళ్ళ కాంగ్రెస్ పాలనలో అదంతా తుడిచి పెట్టుకుపోయిందన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలలో తెలంగాణ వెనకబడిపోయిందని, ఇదొక నికృష్ట పాలనన్నారు.
అదే సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, నస్తూర్ పల్లిలో సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ, “రెండున్నరేళ్ళుగా ఫామ్‌హౌసులో పడుకున్న పెద్ద మనిషి ఇవాళ్ళ బయటకు వచ్చి ప్రజా ప్రభుత్వం పోవాలని, తనకు అధికారం కావాలని అంటున్నారు. దేనికి?
నేరెళ్ళలో ఇసుక లారీలాతో ఎస్సీలను తొక్కించినందుకా? ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీలు వేసినండుకా? ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షా పత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్ముకొని లక్షల మంది యువత ఉసురు పోసుకున్నందుకా?
వాస్తు పిచ్చితో వందల కోట్లు ఖర్చు చేసి తన కోసం ప్రగతి భవన్ కట్టించుకున్న ఆ పెద్ద మనిషే నిక్షేపంగా ఉన్న సచివాలయాన్ని కూల్చేసి సచివాలయం కట్టించారు. కానీ పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టాలంటే కుంటి సాకులు చెప్పారు.
మా ప్రభుత్వం పేదల కోసం 4.5 లక్షల ఇళ్ళు నిర్మిస్తోంది. రైతులకు ఒకేసారి రూ.2 లక్షలు రుణమాఫీ చేసింది. మహాలక్ష్మి ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఇంకా అనేక సంక్షేమ పధకాలు, హామీలు అమలు చేస్తున్నాము.
మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం, భద్రాచలం, బాసర, వేములవాడ, కాళేశ్వరం ఆలయాలను అభివృద్ధి చేస్తున్నాం.
బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు జరిగినందునే ప్రజలు గద్దె దించారనే విషయం మరిచి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
మీ అందరి సాక్షిగా మా పార్టీ కార్యకర్తల సాక్షిగా చెపుతున్నా... వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేస్తా. నేను అధికారంలో ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీని రానీయను,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.