ఈరోజు సాయంత్రం జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. దాదాపు ఏడాది తర్వాత కేసీఆర్ ఈ సభ ద్వారా ప్రజల ముందుకు వస్తున్నారు. కనుక ఆ పార్టీకి ఈ సభ చాలా కీలకమైనది. ఇలాంటి సమయంలో పార్టీ సీనియర్ నాయకుడు హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎంపీ రవిచంద్రతో కలిసి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
కేసీఆర్ ఆదేశం మేరకు వారు ఢిల్లీ వెళ్ళారు. ఈ నెల 22న తెలంగాణ హైకోర్టు కాళేశ్వరం కమీషన్‌పై తుది తీర్పు చెప్పే అవకాశం ఉంది.
కేసీఆర్, హరీష్ రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ తదితరులు కాళేశ్వరం కమీషన్ ఏర్పాటు సరి కాదని, ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయంటూ అదిచ్చిన నివేదిక రాజకీయ దురుదేశ్యంతో కూడినది కనుక దాని ఆధారంగా తమపై కేసు నమోదు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్స్ వేశారు.
ఒకవేళ హైకోర్టు తమకు వ్యతిరేకంగా తీర్పు చెప్పినట్లయితే, తెలంగాణ ప్రభుత్వం వెంటనే కేసీఆర్, హరీష్ రావులపై కేసులు నమోదు చేసి నోటీసులు ఈయవచ్చు.
కనుక హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే వెంటనే సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్స్ వేసేందుకు ఢిల్లీలోని సుప్రీంకోర్టు న్యాయవాదులతో మాట్లాడేందుకు హరీష్ రావు, వినోద్, రవిచంద్రలను కేసీఆర్ ఢిల్లీ పంపారు.
కానీ జగిత్యాలలో కీలకమైన సభ జరిగే సమయంలో హరీష్ రావుని ఢిల్లీ పంపడమే కాస్త ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయనపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభలో హరీష్ రావుని పక్కన పెట్టుకొని కేసీఆర్ ఆమెకు దీటుగా జవాబు చెప్తే ఇబ్బందికరంగా ఉంటుంది. బహుశః అందుకే ఈ వంకతో ఢిల్లీకి పంపించారేమో?