సోమవారం సాయంత్రం జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. దాదాపు ఏడాది తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈ సభ ద్వారా మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నారు. ఈ సభకి బీఆర్ఎస్ పార్టీ బాగానే ప్రచారం చేస్తోంది. ఈ సభలోనే జీవన్ రెడ్డి, అయన అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. కనుక అందరూ కలిసి భారీగా జనసమీకరణ చేసి ఈ సభని విజయవంతం చేసేందుకు చాలా శ్రమిస్తున్నారు.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ సభలో కేసీఆర్ పార్టీకి మైలేజ్ పెరిగేలా ఏవైనా కొత్త విషయాలు చెప్తారా లేక సిఎం రేవంత్ రెడ్డిని, ఆయన పాలనని తిట్టిపోసి వచ్చే ఎన్నికలలో మనమే అధికారంలోకి వస్తామని చెప్పి వెళ్ళిపోతారా? అనేది చాలా కీలకం కానుంది.
అలాగే పార్టీ పేరు మార్పు, కేంద్రం-బిజేపి పట్ల బీఆర్ఎస్ పార్టీ వైఖరి, కూతురు కవిత రాజకీయాలపై కేసీఆర్ తమ పార్టీ వైఖరిని స్పష్టంగా చెప్పాలి. లేకుంటే ఊక దంపుడు ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోతే జగిత్యాల సభ నుంచే పార్టీ పతనం మొదలయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది.
ఏవిధంగా అంటే, గత ఏడాది ప్లీనరీలో కేసీఆర్ అస్పష్ట వైఖరి ప్రదర్శించారంటూ తండ్రికి కవిత లేఖ, ఆ తర్వాత విమర్శలు, బహిష్కరణ అన్నీ కొన్ని నెలల వ్యవధిలోనే జరిగాయి. కనుక నేటి సభలో కేసీఆర్ ప్రతీ అంశంఫై పూర్తి స్పష్టత ఇవ్వకుండా మళ్ళీ ఫామ్‌హౌసుకి వెళ్ళిపోతే, ఇక బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ని నమ్ముకొని ప్రయోజనం ఉండదని పార్టీ నేతలు ఏప్రిల్ 25న కవిత పార్టీ ఏర్పాటు కాగానే దానిలో జేరిపోయెందుకు క్యూ కట్టడం ఖాయం. అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందే మెల్లగా కుప్పకూలడం ఖాయం.
కనుక జగిత్యాల సభలో కేసీఆర్ మళ్ళీ సింహంలా గర్జించి, పార్టీ శ్రేణులకు నమ్మకం కలిగించడం చాలా అవసరం.