ఇటీవల నటుడు ప్రకాష్ రాజ్ రామలక్ష్మణులు, రామాయణం గురించి చాలా చులకనగా, వ్యంగ్యంగా మాట్లాడారు. దానిపై టిటిడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి లీగల్ నోటీస్ పంపారు. సోషల్ మీడియాలో నెటిజన్స్, పలు హిందూ సంఘాలు ఆయనపై విరుచుకుపడుతున్నాయి కూడా.
వాటిపై ఆయన స్పందిస్తూ, నేను అన్ని మతాలను గౌరవిస్తాను. అలాగే హిందూ మతాన్ని కూడా. నేను మాట్లాడింది పూర్తిగా వినకుండా నా ప్రసంగంలో ఆ రెండు మూడు వాఖ్యాలే తీసుకొని నేను శ్రీరాముడి గురించి తప్పుగా మాట్లాడానని, హిందువుల మనోభావాలు దెబ్బ తీశానని కొందరు ఆరోపిస్తున్నారు.
నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనే నన్ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారు. హిందూ మతం లేదా మరే మతాన్ని అవమానించాల్సిన అవసరం నాకు లేదు,” అని అన్నారు.
ప్రకాష్ రాజ్ బిజేపిని, దాని మతతత్వ రాజకీయాలను, ప్రధాని మోడీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. కనుక అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శిస్తుంటారు. ఇప్పుడు కూడా డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల ఫలాలను దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించాలని ఆయన ఉద్దేశ్యం.
అదే ముక్క నేరుగా చెప్పి ప్రధాని మోడీని నిలదీయవచ్చు. కానీ ఈ విషయం చెప్పేందుకు రామలక్ష్మణులు ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలని వారు దక్షిణాదిన రావణుడి తోటలో పళ్ళు దొంగతనం చేశారంటూ ప్రకాష్ రాజ్ ఉపమానాలు చెప్పడమే తప్పు.
కోట్లాది మంది హిందువులు పూజించే శ్రీరాముడు గురించి అంత చులకన మాట్లాడి నేను ఆ ఉద్దేశ్యంతో అనలేదంటూ మళ్ళీ చేసిన తప్పుని సమర్ధించుకోవడం ఇంకా తప్పే కదా?