లోక్‌సభలో మహిళా రిజర్వేషన్స్ బిల్లు తిరస్కరణ

April 18, 2026


img

మహిళా రిజర్వేషన్స్ బిల్లుని లోక్‌సభ తిరస్కరించింది. చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్ కల్పిస్తూ 2023లో చట్టం ఉంది. కానీ దానిని ఇంత వరకు అమలు చేయలేదు. ఆ చట్టానికి సవరణ చేసి 2029 ఎన్నికలలో అమలుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టింది.

దీనికి ఆమోదం లభించాలంటే లోక్‌సభలో 2/3 వంతు మంది మద్దతు అవసరం. ఆ ప్రకారం శుక్రవారం లోక్‌సభకు హాజరైన 528 ఎంపీలలో 352 మంది మద్దతు అవసరం. కానీ 298 మంది మాత్రమే అనుకూలంగా, మిగిలిన 230 మంది ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కనుక సభలో2/3 వంతు మెజార్టీ లభించనందున 54 ఓట్ల తేడాతో ఈ బిల్లు తిరస్కరించబడిందని స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం దీనిని డీలిమిటేషన్‌ బిల్లుతో ముడి పెట్టడం వల్లనే ఓడిపోయిందని కాంగ్రెస్‌, మిత్ర పక్షాలు స్పష్టం చేశాయి. దేశ రాజకీయాలను తమకు అనుకూలంగా మలుచుకోనేందుకే మోడీ ప్రభుత్వం అతి తెలివి ప్రదర్శిస్తూ రెండు బిల్లులు ముడి పెట్టి లోక్‌సభకు తెచ్చిందని, అందుకే పరాభవం ఎదురైందని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.    ఒకవేళ 2023 బిల్లుని యధాతధంగా మళ్ళీ ప్రవేశపెడితే అందరం మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రాహుల్ గాంధీ అన్నారు.

దేశంలో జన గణన కాక జరుగుతున్నప్పుడు అది పూర్తయ్యేవరకు ఆగి పెరిగిన జనాభా ప్రకారం మహిళా రిజర్వేషన్స్ అమలు చేయాలని తాము మొదటి నుంచి సూచిస్తూనే ఉన్నామని బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం తొందరపాటుతో ఒక చారిత్రిక అవకాశం కోల్పోయిమ్దన్నారు.      

సిఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ, డీలిమిటేషన్‌ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు, దేశంలో చిన్న రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందని, కనుక అటువంటి బిల్లులు తేవద్దని వారిస్తున్నా వినకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు చాటున డీలిమిటేషన్‌ బిల్లుని దొడ్డిదారిన ఆమోదింపజేసుకోవాలని ప్రయత్నించి పరాభవం పాలైందన్నారు.    

మహిళా రిజర్వేషన్ బిల్లు తిరస్కరించబడినందున, డీలిమిటేషన్‌ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబందించిన బిల్లుని కూడా వెనక్కు తీసుకుంటున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి కిరణ్ రిజిజూ స్పీకర్‌ ఓం బిర్లాకు తెలియజేశారు.


Related Post