ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో తెలంగాణ నుంచి బియ్యం సేకరణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య ప్రతిష్టంభన ఏర్పడింది. దేశ ప్రజలు సన్న బియ్యం మాత్రమే ఇష్టపడుతున్నారని కనుక పరిమితికి మించి బాయిల్డ్ రైస్ సేకరించలేమని అప్పుడే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.
కనుక అప్పుడు సిఎంగా ఉన్న కేసీఆర్ కూడా రాష్ట్రంలో రైతులకు పప్పు దినుసులు, పామాయిల్, ఇతర పంటలకు మారాలని, వరి పండించడం తగ్గించుకోవాలని సూచించారు. కాదని వరి పండిస్తే మీరే నష్టపోతారని హితవు చెప్పారు. ఆ పేరుతో బిజేపి-బీఆర్ఎస్ పార్టీల మద్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య కొంత కాలం జోరుగా రాజకీయాలు కూడా సాగాయి. ఆ కథలన్నీ అందరికీ గుర్తుండే ఉంటాయి.
మళ్ళీ ఇప్పుడు అదే సమస్య మొదలైనట్లుంది. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీని కలిశారు. 2025-2026లో రెండు సీజన్లు కలిపి మొత్తం 90 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ వస్తుందని కనుక దానిలో కనీసం 30 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కేంద్ర ప్రభుత్వం సేకరించాలని వారు కోరారు.
దీనిపై కేంద్ర మంత్రి వారికి ఏం సమాధానం చెప్పారో త్వరలో తెలుస్తుంది. కానీ తెలంగాణ బాయిల్డ్ రైస్ సేకరణ కథ మళ్ళీ మొదటికొచ్చినట్లు వారి భేటీతో స్పష్టమవుతోంది.