ఎవరికీ నష్టం జరుగదు.. నేను గ్యారెంటీ: మోడీ

April 17, 2026


img

డీలిమిటేషన్‌పై కాంగ్రెస్‌ మిత్ర పక్షాలు తీవ్ర అభ్యంతరాలు చెపుతున్న నేపధ్యంలో ప్రధాని మోడీ వారికి నిన్న లోక్‌సభలో ధీటుగా సమాధానం చెప్పారు. “ఈ పార్లమెంటు ఒక పవిత్రమైన వేదిక ద్వారా దేశానికి ఏవిధంగా మరింత మేలు చేయాలనే ఆలోచనే తప్ప దక్షిణాది రాష్ట్రాలకు లేదా దేశంలో చిన్న రాష్ట్రాలకు అన్యాయం చేయాలని మేము ఎన్నడూ కోరుకోము.

దేశంలో ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాలు, చిన్న, పెద్ద రాష్ట్రాలన్నిటినీ మేము సమానంగానే భావిస్తాము. గౌరవిస్తాము. గత ప్రభుత్వాల హయంలో ఏ పద్దతిలో డీలిమిటేషన్‌ జరిగిందో ఇప్పుడూ అదే పద్దతిలో జరుగుతోంది. కనుక దేశంలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరుగదు. దీనికి నేను గ్యారెంటీ ఇస్తున్నాను. లేదా వాగ్దానం చేస్తున్నాను.

తమిళంలో ఇంత కంటే మరేదైనా మంచి పదముంటే దాంతో ప్రజలకు భరోసా ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కనుక డీలిమిటేషన్‌ విషయంలో అనుమానాలు, అపోహలు అవసరం లేదు,” అని ప్రధాని మోడీ అన్నారు.  

పెద్దనోట్ల రద్దు సమయంలో కొత్త కరెన్సీకి ఏ మాత్రం లోటు లేదని కనుక ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధాని మోడీ అన్నారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో, దేశ ప్రజలు ముఖ్యంగా వ్యాపారులు ఎంతగా ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసు. 

కరోనా సమయంలో కూడా దేశ ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే “పరిస్థితి అదుపులోనే ఉంది.. అందరూ దీపాలు వెలిగించండి... పళ్ళాలతో చప్పుళ్ళు చేయండి,” అంటూ ప్రోత్సహించారు. 

లాక్ డవున్ సమయంలో దేశంలో లక్షలాది మంది భార్యా, చంటి పిల్లలు, వృద్ధులు, తల్లి తండ్రులతో కలిసి రోడ్లపై వేలాది కిలోమీటర్లు నడుచుకువెళుతున్నప్పుడు, దారిలో ప్రాణాలు కోల్పోతున్నప్పుడు కూడా “పరిస్థితులు అదుపులోనే ఉన్నాయన్నారు” తప్ప రైళ్ళు, బస్సులు ఏర్పాటు చేయలేదు. కనీసం దారిలో వారికి ఆహారం, మంచి నీళ్ళు, తాత్కాలిక వసతి సౌకర్యాలు కల్పించలేదు.          

ఇప్పుడు గ్యాస్ సంక్షోభం ఏర్పడితే, “దేశంలో పుష్కలంగా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. ఎవరూ ఆందోళన చెందవద్దని” మభ్య పెడుతున్నారే తప్ప వెయ్యి రూపాయల గ్యాస్ సిలిండర్లు బ్లాకులో 4,000కి అమ్ముడవుతున్నా పట్టించుకోవడం లేదు. 

భవిష్యత్‌లో డీలిమిటేషన్‌ వలన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాధాన్యత కోల్పోతాయని విపక్షాలు ఆందోళన చేస్తుంటే, “ఏ రాష్ట్రానికి నష్టం జరగదు నేను గ్యారెంటీ, వాగ్దానం చేస్తున్నానని..” ప్రధాని మోడీ అంటున్నారు! అయన మాటలు ఎలా నమ్మగలం? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 


Related Post