ఈ నెల 25న కొత్త పార్టీ ప్రకటించబోతున్న కల్వకుంట్ల కవిత నేడు కాశీలో విశ్వేశ్వరుడు, కాల భైరవ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఆమెకు కాశీకి బయలుదేరే ముందు హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో కలిపి కేంద్రం కుట్ర చేస్తోంది. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ అమలు చేయాలనుకోవడం సిగ్గుచేటు. డీలిమిటేషన్‌తో తెలంగాణ రాజకీయ ప్రాధాన్యం తగ్గిస్తే ఊరుకోబోము.
పార్లమెంట్‌లో తెలంగాణకు 3.13% ప్రాతినిధ్యం ఉంది. అది ఏమాత్రం తగ్గినా సహించే ప్రసక్తే లేదు. తెలంగాణకు అన్యాయం జరిగితే మరోసారి పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవు. మహిళా బిల్లులో బీసీ సబ్ కోటా తప్పనిసరిగా ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాము,” అని అన్నారు.
డీలిమిటేషన్‌లో ప్రతీ రాష్ట్రానికి కనీసం 50 శాతం శాసనసభ, లోక్‌సభ సీట్లు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. కనుక తెలంగాణ రాష్ట్రంలో భారీగా సీట్లు పెరుగుతాయే తప్ప తగ్గవు. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేసుకుంటున్న ఈ తరుణంలో రాష్ట్రంలో శాసనసభ, లోక్‌సభ సీట్లు పెరిగితే ఆమె పార్టీకి కూడా లాభమే.
కానీ జాతీయ స్థాయిలో చూస్తే ఈ డీలిమిటేషన్ తర్వాత పార్లమెంటులో ఉత్తరాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం భారీగా పెరుగుతుంది. తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలకు తగ్గుతుందని ఇది సరికాదని సిఎం రేవంత్ రెడ్డి వాదన సహేతుకమే.
కానీ కేటీఆర్, కవిత ఇద్దరూ పరస్పరం కత్తులు దూసుకుంటూ, రేవంత్ రెడ్డిపై కూడా కత్తులు దూస్తూనే ఉన్నప్పుడు, ఇలాంటి సమస్యలపై కలిసి ఎలా పోరాడగలరు?