డీలిమిటేషన్ ప్రతిపాదనపై దక్షిణాది రాష్ట్రాలు, కాంగ్రెస్ మిత్ర పక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ బిల్లుని ఆమోదింపజేయబోతోంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ, “మేము అధికారంలో ఉన్నప్పుడూ ఈ ప్రతిపాదనని వ్యతిరేకించాము. ఇప్పుడూ వ్యతిరేకిస్తున్నాము. దీనిపై మా వైఖరిలో ఎటువంటి మార్పూ లేదు.
రాజ్యాంగం ప్రకారం జన గణన చేసిన తర్వాత దాని ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం 2011 నాటి జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తోంది. ఈ 15 ఏళ్ళలో దక్షిణాది రాష్ట్రాల జనాభా ఇంకా తగ్గిపోగా, ఉత్తరాది రాష్ట్రాల జనాభా గణనీయంగా పెరిగిపోయింది. అంటే కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు కుటుంబ నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగిస్తూ, పాటించని ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేస్తారా?
లోక్‌సభలో ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యం లేదు. డీలిమిటేషన్ తర్వాత పూర్తిగా పోతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మొండిగా ఈ బిల్లుని తెస్తోంది. కనుక భవిష్యత్‌లో దక్షిణాది రాష్ట్రాలలో పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తాం. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ ఈ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తుంది,” అని అన్నారు.