నేటి నుంచి మూడు రోజులపాటు సాగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో చట్ట సభలలో డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి చట్ట సవరణ బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు.
వీటిలో డీలిమిటేషన్ బిల్లుని కాంగ్రెస్, మిత్రపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈవిధంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ఎంపీల మద్దతు లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటవుతుందని, అప్పుడు దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత కోల్పోయి ఉత్తరాది వారికి దేశ రాజకీయాలపై పూర్తి పెత్తనం లభిస్తుందని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి వాదిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ కూడా అయన వాదనలతో ఏకీభవించి వ్యతిరేకిస్తోంది. కనుక దీనిపై పార్లమెంటులో వాడి వేడిగా వాదోపవాదాలు జరుతాయి. కానీ ఎన్డీయే కూటమికి లోక్‌సభలో తగినంత బలం ఉంది కనుక ఈ బిల్లుని ఆమోదింపజేసుకోగలదు.
కాంగ్రెస్, బిజేపి కూటములకు దూరంగా ఉన్న దేశంలో పలు ప్రాంతీయ పార్టీలు వివిధ కారణాలు, అవసరాల కోసం రాజ్యసభలో ఈ బిల్లుకి ఆమోదముద్ర పడేందుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తోడ్పడతాయి. కనుక వివాదాస్పదమైన ఈ బిల్లుకి పార్లమెంట్ ఆమోదముద్ర పడటం ఖాయమనే భావించవచ్చు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. కనుక దీని ఆమోదానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.
ఈ రెండు బిల్లులు చట్ట రూపం దాల్చితే ప్రస్తుతం 543 లోక్‌సభ స్థానాలు ఒకేసారి 850కి పెరుగుతాయి. వాటిలో 33 శాతం అంటే 273 సీట్లు మహిళలకు దక్కుతాయి.
కనుక డీలిమిటేషన్ బిల్లుని వ్యతిరేకిస్తే మహిళా రిజర్వేషన్ బిల్లుని వ్యతిరేకించినట్లే అవుతుందని బిజేపి నేతలు వాదిస్తున్నారు.