కల్వకుంట్ల కవిత ఈ నెల 25న కొత్త పార్టీ జెండా, అజెండా ప్రకటించేందుకు జోరుగా ఏర్పాట్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంతకాలం ఆమె బీఆర్ఎస్ పార్టీ, నేతల మీద, కేసీఆర్ పాలన మీద ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా స్పందించని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారిగా నేడు స్పందించారు.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్, “కన్నవారికి మేలు చేయకపోయినా పర్వాలేదు. కానీ వారిని బాధ పెట్టకూడదు. కల్వకుంట్ల కవిత మాటలు, ప్రవర్తన వలన తరచూ మా కుటుంబ సభ్యులు మనస్తాపానికి గురవుతున్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు.
కల్వకుంట్ల కవిత చాలా తెలివైనది. రాజకీయాల పట్ల మంచి అవగాహన కలిగి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఆమె ఈవిధంగా మాట్లాడటం, వ్యవహరించడం సరికాదు.
ఇదివరకు రాజకీయంగా కొన్ని తప్పులు చేసి నష్టపోయాము, వాటిలో పార్టీ పేరు మార్పు కూడా ఒకటి. బీఆర్ఎస్ పార్టీ పేరుని మళ్ళీ టిఆర్ఎస్ పార్టీగా మార్చాలని ప్రజలు, పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు. దీనిపై ఆలోచన చేస్తున్నాము.
మేము మహారాష్ట్రాకు మా పార్టీని విస్తరించాలనుకున్నప్పుడు తెలంగాణలోకి పొరుగు రాష్ట్రాల పార్టీలు రావడం తప్పుగా భావించము. ఎన్ని పార్టీలు వచ్చినా మంచిదే. కానీ ప్రజలు ఓట్లు వేసి గెలిపించినప్పుడే వాటికి గౌరవం.
మాకు ఏ పార్టీలతో పొత్తులు అచ్చి రాలేదు. కనుక మాకు పొత్తు ఆలోచనలు లేవు. చంద్రుడుకి మబ్బులు అడ్డొచ్చినప్పుడు మసకబారినట్లు కనబడతాడు. మబ్బులు తొలగాగానే మళ్ళీ ఉజ్వలంగా ప్రకాశిస్తాడు. కేసీఆర్ కూడా అంతే. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలిచి మళ్ళీ కేసీఆర్ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు.
ఇప్పటి వరకు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులలో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్సార్, కేసీఆర్ నలుగురు మాత్రమే చరిత్రలో చెరగని ముద్ర వేశారు,” అని కేటీఆర్ అన్నారు.
ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఉంది. కనుక పార్టీ పరంగా కొన్ని అంశాలపై కేటీఆర్ స్పష్టత ఇస్తున్నారని భావించవచ్చు.
కవితని బయటకు పంపించి ఉండకపోతే ఆమె పార్టీ పెట్టేవారే కారు కదా? కనుక ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? ఆమె పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు మొదలయ్యే అవకాశం ఉందనే విషయం కేటీఆర్‌కి తెలియదనుకోలేము. కనుక ముందుగా వాటి గురించి జాగ్రత్త పడితే మంచిది.
“టిఆర్ఎస్ పార్టీ పేరుని కేసీఆర్ వదులుకున్నారు కనుక ఇప్పుడా పేరు ఫ్రీగా ఉందని, దానిని ఎవరైనా వాడుకోవచ్చని కల్వకుంట్ల కవిత ఇటీవలే అన్నారు. ఆమెకు జవాబుగా పార్టీ పేరు మార్పు గురించి కేటీఆర్ మాట్లాడినట్లు అర్ధమవుతూనే ఉంది.
కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనే ఆలోచనతోనే పార్టీ పేరు మార్చుకొని నష్టపోయారని ఇన్నేళ్ళ తర్వాత కేటీఆర్ అంగీకరించడం మంచిదే.
జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకున్నప్పుడు జాతీయస్పూర్తితో వ్యవహరించాలి కదా? కానీ ఇంతకాలం తెలంగాణలో మరే పార్టీ అడుగు పెట్టరాదన్నట్లు సంకుచితభావంతో మాట్లాడేవారు. ఇప్పుడు అది కూడా తప్పేనని అంగీకరించినట్లు కేటీఆర్ మాటలతోనే స్పష్టమవుతోంది. ప్లీనరీ సభలో అన్ని అంశాలపై మరింత స్పష్టత ఇస్తారని భావించవచ్చు.