బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ సీనియర్ నేతలు నిన్న జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఇందుకు అయన సానుకూలంగా స్పందించారు. వారు సుమారు అర్ధగంటపైగా సమావేశమై అన్ని విషయాలు మాట్లాడుకున్నారు.
అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీతో 40 ఏళ్ళ అనుబందం తెంచుకునేటప్పుడు ఎంతగా బాధ పడ్డానో బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నందుకు అంతగా సంతోషిస్తున్నాను. త్వరలో కేసీఆర్‌ని కలిసి భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడుతాను. నాకు పదవులు ముఖ్యం కాదు ప్రజాహితమే ముఖ్యం. అందుకే ప్రజల కోసం పనిచేసే బీఆర్ఎస్ పార్టీ చేరాలని నిశ్చయించుకున్నాను.
రేవంత్ రెడ్డి రెండున్నరేళ్ళ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో వెనకబడిపోయింది. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు. కనుక వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం తధ్యం,” అని అన్నారు.
జీవన్ రెడ్డిని బిజేపిలోకి తీసుకురావాలని ప్రయత్నించిన నిజామాబాద్ బిజేపి ఎంపీ ధర్మపురి అర్వింద్ భిన్నంగా స్పందించారు. “తెలంగాణలో క్రమంగా అస్తిత్వం కోల్పోతున్న బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి చేరబోతుండటం తొందరపాటు నిర్ణయమే.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గతంలో మా పార్టీలో ఉన్నప్పుడు మున్సిపల్ చైర్ పర్సన్ బోగా శ్రావణిని బయటకు వెళ్ళిపోయేలా చేశారు. ఆ తర్వాత అయన కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు జీవన్ రెడ్డిని బయటకు పంపించేశారు. మా పార్టీ సానుకూలంగా స్పందించక పోవడంతో జీవన్ రెడ్డిని బిజేపిలోకి తీసుకురావాలనే నా ప్రయత్నం విరమించుకోవాల్సి వచ్చింది,” అని అన్నారు.