ఇటీవల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి నేడో రేపో బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో తాను భేటీ కాబోతున్నానని స్వయంగా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయం అయ్యింది కనుక ఆయన అప్పుడే ఆ పార్టీ గొంతుతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు.
జగిత్యాల పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి, బీఆర్ఎస్ పార్టీ గెలుపు తధ్యం. పదేళ్ళ కేసీఆర్ పాలనతో పోల్చి చూస్తే రెండేళ్ళ రేవంత్ రెడ్డి పాలన చాలా దారుణంగా ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైంది. కనీసం ఎన్నికల హామీలు కూడా నిలబెట్టుకోలేకపోయింది.
రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పాలనతో వేసారిపోయారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గద్దె దించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టడం ఖాయమే. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఇదే మొదటి, చివరి అవకాశం కాబోతోంది,” అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డికి తగిన పదవి, ప్రాధాన్యం లభించకనే పార్టీని వీడారనేది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ అయనకు మంత్రి పదవో లేదా రాజ్యసభ సీటో ఇచ్చి ఉండి ఉంటే నేడు కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. రేవంత్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందని పొగుడుతూ ఉండేవారు కదా?
వచ్చే ఎన్నికలలో అయనకు లేదా కుటుంబ సభ్యులకు జగిత్యాల సీటు ఇస్తామని హామీ లభించినందునే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న మాట వాస్తవం కాదా? ఒకవేళ సీటు ఆఫర్ చేయకపోతే బీఆర్ఎస్ బదులు బిజేపిలో చేరి ఉండేవారు కదా?
కనుక జీవన్ రెడ్డికి పదవి, ప్రాధాన్యత లభించక పార్టీ మారినంత మాత్రాన్న ప్రజలు కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?