ఇదివరకు తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ తరచూ, “తెలంగాణ రాష్ట్రంలో ఎకరం అమ్ముకుంటే ఏపీలో మూడెకరాలు కొనుక్కోవచ్చు,” అని చెప్తుండేవారు. కానీ ఏపీ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే, “షాపులో రూపాయికి చాక్లెట్ వస్తుందో లేదో గానీ ఏపీలో వేలకోట్లు విలువ చేసే భూములు రూపాయి కంటే తక్కువ ధరకే లభిస్తున్నాయి.
సిఎం చంద్రబాబు నాయుడు తన బంధువు, విశాఖ ఎంపీకి విశాఖలో రుషికొండ ఎదురుగా ఉన్న 50 ఎకరాల భూమి చాక్లెట్ కంటే తక్కువ ధరకే ఇచ్చేశారు. అభివృద్ధి పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ భూములను సొంత మనుషులకు అప్పనంగా పంచిపెట్టేస్తున్నారు. ఇది తప్పని చెపితే రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ మాపై ఎదురుదాడి చేస్తున్నారు,” అని జగన్మోహన్ రెడ్డి అన్నారు.
విశాఖలో ప్రముఖ సంస్థలకు ఎకరం 99 పైసల చొప్పున కట్టబెట్టేసినప్పుడు వైసీపీ అభ్యంతరం చెప్పింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సదరు సంస్థలకు దాదాపు ఉచితంగా భూములు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి?
అవి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు భూములు కొనుగోలు చేయలేని దయనీయ స్థితిలో లేవు కదా? కనుక మిగిలిన సంస్థలతో పోటీ పది వేలంపాటలో కొనుగోలు చేయాలని చెప్పకుండా ఎకరం 99 పైసల చొప్పున కట్టబెట్టేయడం దేనికి? అని వైసీపీ ప్రశ్న! నేడు జగన్ మళ్ళీ అదే ప్రశ్నిస్తున్నారు. కానీ ఎదురుదాడి తప్ప జవాబు ఉండదు.