కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి, అవకతవకలు జరిగాయంటూ జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ నివేదికపై అభ్యంతరం చెపుతూ మాజీ సిఎం కేసీఆర్, మాజీ సాగునీటి, ఆర్ధిక శాఖల మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.కె.జోషి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే.
వాటిపై ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు నేడు తుది తీర్పు వెలువరించాల్సి ఉండగా, ఈ నెల 22న ప్రకటిస్తామని చెపుతూ వాయిదా వేసింది.
పీసీ ఘోష్ కమీషన్ ఏర్పాటు చెల్లదని, రాజకీయ దురుదేశ్యంతో అది ఇచ్చిన నివేదికని రద్దు చేయాలంటూ పిటిషన్లు వేశారు. కానీ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వాలకు విచారణ జరిపేందుకు సర్వాధికారాలు ఉంటాయి. ఈ విచారణ పారదర్శకంగా, న్యాయ సమ్మతంగా ఉండేందుకు సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తులతో కమీషన్ ఏర్పాటు చేసే అధికారం కూడా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే చేసింది.
కనుక హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చే అవకాశమే ఎక్కువ. కానీ కమీషన్ నివేదిక ఆధారంగా ఎవరినీ అరెస్ట్ చేయవద్దని ఆదేశించవచ్చు. కనుక తీర్పు వెలువడిన వెంటనే ఈ కేసు విచారణ వేగవంతం అయ్యే అవకాశం ఉంటుంది.