అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కి చివరి హెచ్చరిక జారీ చేశారు. భారత్ కాలమాన ప్రకారం మంగళవారం సాయంత్రంలోగా హోర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, చమురు బావులు, వంతెనలు వగైరా మౌలిక వసతులను సర్వనాశనం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, “ఇరాన్‌కు చాలా అవకాశాలు ఇచ్చాము. కానీ ఇరాన్ మొండిపట్టు వీడటం లేదు. కనుక ఈరోజు రాత్రి ఇరాన్‌లోని నాగరికత పూర్తిగా తుడిచిపెట్టేయబోతున్నాము. ఇరాన్ మళ్ళీ ఎన్నటికీ కోలుకోలేదు. నిజానికి ఇరాన్‌ని సమూలంగా తుడిచిపెట్టేయడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. కానీ ఇరాన్ మొండితనం వలన ఇలాంటి కటిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. ప్రపంచ చరిత్రలో ఈ రాత్రి ఓ భయంకరమైన కాళరాత్రిగా నిలిచిపోబోతోంది,” అని ట్రంప్ హెచ్చరించారు.
ఇప్పటికే అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌కి ఆయువు పట్టువంటి ఖర్గ్ ద్వీపంలో కీలక స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ రాత్రి మరింత భీకరమైన దాడులు చేయబోతున్నాయి.
ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ కూడా అంతే ధీటుగా బదులిచ్చింది. ఇన్ని రోజులు మేము కూడా యుద్ధం ముగింపు కోసం చాలా సహనంతో ఎదురుచూశాము. ఇరాన్ నాగరికతని సమూలంగా తుడిచిపెట్టేస్తానని గర్వంతో విర్రవీగుతున్న ట్రంప్‌కు, ఈ యుద్ధంలో ఆయనకు సహకరిస్తున్న అమెరికా మిత్ర దేశాలు ఎన్నటికీ మరిచిపోలేని విధంగా దెబ్బ తీస్తాము,” అని ఇరాన్ ట్వీట్ చేసింది.
ఇరాన్‌ని సమూలంగా తుడిచిపెట్టేస్తానని ట్రంప్ బెదిరిస్తుంటే ప్రపంచదేశాలు నిసహాయంగా చూస్తుండిపోతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ మిత్ర దేశాలైన చైనా, రష్యాలు ఇరాన్‌కు ప్రత్యక్షంగా సహాయపడలేకపోతున్నాయి. ఒకవేళ అవి జోక్యం చేసుకుంటే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది. కనుక అన్ని దేశాలు ఒంటరి పోరాటం చేస్తున్న ఇరాన్‌ని కళ్ళెదుటే నాశనం కాబోతుంటే నిసహాయంగా చూస్తుండిపోతున్నాయి.