ఈ జూన్ 2 నాటికి రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు పూర్తవుతుంది. విభజన చట్టం ప్రకారం పదేళ్ళపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. కానీ విభజన తర్వాత ఏపీ సిఎంగా బాధ్యత చేపట్టిన చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి కార్యాలయాలు, అధికారులు, ఉద్యోగులను విజయవాడ తరలించుకుపోయారు. ఏపీ రాజధానిగా అమరావతిని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
కానీ జగన్మోహన్ రెడ్డి దానిని వద్దనుకొని 5 ఏళ్ళు పాడుబెట్టేసి మూడు రాజధానులు, విశాఖ రాజధాని అంటూ5 ఏళ్ళు కాలక్షేపం చేసి దిగిపోయారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ సిఎం కాగానే అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేస్తుండటమే కాక భవిష్యత్‌లో మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చినా అమరావతిని మార్చకుండా చట్టబద్దత కల్పించారు.
పార్లమెంటులో విభజన చట్టంలో ‘ఏపీకి కొత్త రాజధాని’ అనే దానిని ఏపీ రాజధాని అమరావతి’ అని చట్ట సవరణ చేయించారు. గమ్మతైన విషయం ఏమిటంటే, దీనికి బీఆర్ఎస్, బిజేపి, కాంగ్రెస్‌తో సహా అనేక పార్టీలు మద్దతు పలుకగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిని వ్యతిరేకించింది. ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటు ఆమోదముద్ర వేసిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ కూడా ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయ్యింది.
కేంద్ర ప్రభుత్వం అమరావతిని ఏపీ రాజధానిగా ఖరారు చేసినప్పటికీ, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంగీకరించడం లేదు. అయన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ‘మావిగన్’ అనే రాజధాని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.
గతంలో తాను స్వయంగా మూడు రాజధానులు, విశాఖ రాజధాని ప్రతిపాదనలు చేశాననే సంగతి మరిచి మావిగన్ అంటూ మరో కొత్త ప్రతిపాదన చేస్తున్నారు. అదీ... కేంద్ర ప్రభుత్వం అమరావతిని ఏపీకి రాజధానిగా ఖరారు చేసిన తర్వాత ఇలాంటి వితండ వాదనలు చేస్తుండటం మరీ విచిత్రంగా ఉంది.