తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్ పేరుని వద్దనుకొని బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకుంది. కనుక ఇప్పుడు ఆ పేరు ఎవరైనా వాడుకోవచ్చు. పాత పేరు, కొత్త అజెండాతో మా పార్టీని ప్రకటిస్తా,” అని అన్నారు.
కొన్ని రోజుల క్రితం ఆమె కొత్త పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పుడామె టిఆర్ఎస్ పార్టీ అన్నట్లు మాట్లాడారు.
కనుక ఆమె కొత్త పార్టీ పేరు ఏమిటనే ప్రశ్నకు ఈ నెల 25న సమాధానం లభిస్తుంది. ఆరోజు ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లాలోని అవుటర్ రింగ్ రోడ్ సమీపంలో గల మునీరాబాద్ వద్ద గల ఓ ఫంక్షన్ హాల్లో తన కొత్త పార్టీ ప్రకటిస్తానని కల్వకుంట్ల కవిత శ్రీరామ నవమి రోజున చెప్పారు.
ఒకవేళ ఆమెకు టిఆర్ఎస్ పార్టీ రిజిస్టర్ చేసి ఉండి ఉంటే, బీఆర్ఎస్ పార్టీకి ఇది పెద్ద ఎదురు దెబ్బే అవుతుంది. కేవలం ఈ పేరుకే ఆమె పార్టీకి భారీగా ఓట్లు పడే అవకాశం ఉంది. పార్టీ పేరు ఏదైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది తనతో టచ్‌లో ఉన్నారని పదేపదే చెపుతున్నారు కనుక ఏప్రిల్ 25 తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు మొదలైతే ఇది మరో ఎదురుదెబ్బవుతుంది. కనుక బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కంటే కవిత వల్లనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉండవచ్చు.