సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు.
అప్పటి నుంచి ఆయనకు నచ్చజెప్పేందుకు కాంగ్రెస్ నేతలు, తమ పార్టీలోకి రప్పించుకునేందుకు బిజేపి, బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పార్టీ తరపున ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లు సమాచారం.
బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆయనతో టచ్‌లో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయన బీఆర్ఎస్ పార్టీ చేరితే వచ్చే ఎన్నికలలో ఆయనకు గానీ లేదా అయన కుటుంబ సభ్యులకు గానీ జగిత్యాల ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
బిజేపి ఎంపీ ధర్మపురి అర్వింద్ తండ్రి స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ (డిఎస్) కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డితో మంచి స్నేహం ఉండేది. ఆ పరిచయంతో ఇప్పుడు ఆయన కుమారుడు ధర్మపురి అర్వింద్ జీవన్ రెడ్డిని బిజేపిలోకి రావలసిందిగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
కనుక జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా లేదా రాజీనామా చేసి బిజేపి లేదా బీఆర్ఎస్ పార్టీలో చేరుతారా అనే విషయం రెండు మూడు రోజులలో తేలిపోతుంది.