ఎస్ఎల్‌బీసి సొరంగం పనులు మళ్ళీ ప్రారంభం అయ్యాయి. 2025లో జరిగిన సొరంగ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. ఈ ప్రమాదంలో టన్నల్ బోరింగ్ మెషిన్ కూడా దెబ్బ తినడంతో ఈ ప్రాజెక్టు పనులు మళ్ళీ ఎప్పటికైనా మొదలవుతాయా? పూర్తవుతాయా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
కానీ దీనిపై సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పలుమార్లు సంబంధిత అధికారులు, ఇంజనీర్లతో సమావేశమయ్యి లోతుగా చర్చించిన తర్వాత ఈ ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితులలో పూర్తిచేయాలని నిర్ణయించారు.
అయితే ఈ సారి ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ఆదేశం మేరకు మళ్ళీ ఎస్ఎల్‌బీసి సొరంగం తవ్వకం పనులు ఇటీవలే మొదలయ్యాయి.
వీలైనంత వరకు వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తిచేయాలని, లేకుంటే 2028 జూన్ నాటికి పనులు పూర్తి చేసి నీరు విడుదల చేయాలని సిఎం రేవంత్ రెడ్డి గడువు విధించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇన్‌లెట్ మరియు దేవరకొండ వైపుగల ఔట్‌లెట్ వైపు నుంచి ఒకేసారి తవ్వకం పనులు మొదలుపెట్టారు. ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కార్మికుల భద్రత కోసం గాలి సరఫరా, నిరంతర మానిటరింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 3 టిఎంసీల కృష్ణా జలాలు గ్రావిటీ ద్వారా నల్గొండ జిల్లాకు చేరుతాయి. వీటిలో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీరు అందుతుంది. అంతేకాదు... ప్రస్తుతం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని ఎత్తిపోయడానికి ప్రభుత్వం ఏటా రూ.500 కోట్లు ఖర్చు చేస్తోంది. ఆ భారం కూడా తగ్గుతుంది.