దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు పూర్తిగా విముక్తి లభించింది.
ఈ కేసులో కల్వకుంట్ల కవిత, ఆమె ఆడిటర్ బుచ్చిబాబు, ఢిల్లీ మాజీ సిఎం కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డెప్యూటీ సిఎం మనీష్ సిసోడియాతో సహా మొత్తం 23 మందిపై సీబీఐ వేసిన కేసులన్నిటినీ కొట్టివేస్తున్నట్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి జితేందర్ సింగ్ నేడు తీర్పు ప్రకటించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొన్నవారిలో ఏ ఒక్కరూ తప్పు చేసినట్లు సీబీఐ నిరూపించలేకపోయింది. ఈ కేసులో అందరి పేర్లు చేర్చారు కానీ బలమైన సాక్ష్యాధారాలు చూపలేదు.
కనీసం సీబీఐ ఛార్జ్ షీట్ కూడా సరిగ్గా లేదు. లోపభూయిష్టంగా ఉంది. ఈ కేసు విచారణలో సీబీఐ పూర్తిగా వైఫల్యం చెందింది. ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ కేసు నడిపించినందుకు సీబీఐ మీదనే విచారణ జరిపించాల్సి ఉంటుంది,” అని న్యాయమూర్తి జితేందర్ సింగ్ అన్నారు.
ఈ కేసుని కొట్టివేసి తనతో సహా అందరికీ ఈ కేసు నుంచి విముక్తి కల్పించడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చాలా క్లుప్తంగా ‘సత్యమేవ జయతే’ అని ట్వీట్ చేశారు.