ఓటమి పాఠాలు చాలా విలువైనవి... నేర్చుకోకపోతే!

February 14, 2026


img

ఎన్నికలలో ఓ పార్టీ గెలుపుకైనా, మరో పార్టీ ఓటమికైనా వంద కారణాలు ఉంటాయి. గెలిచిన పార్టీ విజయోత్సవాలు చేసుకుంటున్నప్పుడు, ఓడిన పార్టీ పిర్యాదులు, సంజాయిషీలు ఇస్తుంటుంది. అయితే ఓడిన పార్టీ భేషజాలు పక్కన పెట్టి ఆత్మవిమర్శ చేసుకోగలిగితేనే మళ్ళీ చేదు అనుభవాలు ఎదుర్కోకుండా తప్పించుకోగలుగుతుంది. 

కానీ మున్సిపల్ ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలినా బీఆర్ఎస్‌ పార్టీ తీరు మారలేదని ఆ పార్టీ నేతలు మాట్లాడిన మాటలు, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులే నిరూపిస్తున్నాయి. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజేపిలతో పోరాడగల శక్తి, వాటిని అడ్డుకునే శక్తి కేవలం బీఆర్ఎస్‌ పార్టీకి మాత్రమే ఉందని కేటీఆర్‌ చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒకప్పుడు ఆ రెండు పార్టీలు రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయని బీఆర్ఎస్‌ ఎద్దేవా చేస్తుండేది. ఇప్పుడు వాటితోనే పోరాడున్నామని కేటీఆర్‌ చెప్పుకుంటున్నారు. 

‘తెలంగాణకు బీఆర్ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ నాయకత్వమే శ్రీరామ రక్ష’ అని కేటీఆర్‌ గొప్పగా చెప్పుకున్నారు. కానీ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజేపిల నుంచి తనని తాను కాపాడుకోలేకపోయిన బీఆర్ఎస్‌ పార్టీ తెలంగాణకు ఏవిధంగా శ్రీరామ రక్ష అవుతుంది. 

బీఆర్ఎస్‌ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతున్నా కేసీఆర్‌ ఫామ్‌హౌసులో నుంచి బయటకు రావడం లేదు. కవిత చేస్తున్న విమర్శలు, ఆరోపణలు తిప్పికొట్టే ధైర్యం చేయలేకపోతున్నారు కృష్ణార్జునులు. తమని తాము, తమ పార్టీని  కాపాడు కోలేనివారు రాష్ట్రాన్ని, ప్రజలను ఎలా కాపాడగలరు? 

కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లు పదవుల కోసం కీచులాడుకునేవారు. అలాంటి వారితో కేసీఆర్‌ నాయకత్వంలో సుసిక్షితమైన సైన్యం వంటి బీఆర్ఎస్‌ పార్టీని శాసనసభ ఎన్నికలలో, మళ్ళీ లోక్‌సభ ఎన్నికలలో రేవంత్ రెడ్డి చావు దెబ్బ తీసినప్పుడే బీఆర్ఎస్‌ పార్టీ మేల్కొని ఆత్మవిమర్శ చేసుకొని ఉండి ఉంటే నేడు ఈ దుస్థితి వచ్చేది కాదు. 

కానీ నేటికీ బీఆర్ఎస్‌ నేతలు ఆత్మవిమర్శకు బదులు తమ ఓటమికి కాంగ్రెస్‌, బిజేపి, ప్రధాని మోడీ, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని నిందిస్తూ తమ అసమర్దతని వైఫల్యాలన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా! అంటే వారు తమ భవిష్యత్‌ని కూడా ఇలాగే మార్చుకుంటున్నారనే అనుకోవాలి. 


Related Post